Tuesday, November 5, 2024

కొవిడ్ పాపం చైనాదే

- Advertisement -
- Advertisement -

Covid-19 has no ‘credible natural ancestor’, was created in Wuhan lab

వుహాన్‌ల్యాబ్‌లో చైనా శాస్త్రవేత్తలే
రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా సృష్టించారు
డైలీ మెయిల్ పరిశోధక కథనం

లండన్: కొవిడ్19 వైరస్‌కు సహజ పూర్వీకులు(నేచురల్ యాన్సెస్టర్స్) లేరని, అది చైనా ల్యాబ్‌లోనే కృత్రిమంగా తయారైందని ఇద్దరు శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా వెల్లడించారు. రివర్స్ ఇంజినీరింగ్ పద్ధతిలో చైనా శాస్త్రవేత్తలు కొవిడ్19ను వుహాన్‌లోని ల్యాబ్‌లో సృష్టించారని వారు పేర్కొన్నారు. బ్రిటీష్ ప్రొఫెసర్ ఆంగస్ డల్‌గ్లీష్, నార్వే శాస్త్రవేత్త డా॥బిర్గర్ సోరెన్‌సేన్‌లు తమ పరిశోధనా వివరాల్ని డైలీ మెయిల్ ద్వారా వెల్లడించారు. చైనా శాస్త్రవేత్తలు వారి దేశంలోని గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్ మూలాల్ని తీసుకొని, అందులోకి స్పైక్ ప్రోటీన్‌ను చొప్పించారని పరిశోధకులు పేర్కొన్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందేలా రూపొందించారని వారు తెలిపారు. వీరిద్దరూ వైరస్‌లపై పరిశోధకులన్నది గమనార్హం.

కొవిడ్19 రూపురేఖలు ప్రత్యేకంగా ఉన్నందున ఈ వైరస్ ల్యాబ్‌లోనే తయారై ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ వైరస్‌లో ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్స్‌ను గుర్తించినట్టు వారు తెలిపారు. సహజ వైరస్‌ల్లోని ప్రోటీన్లకు భిన్నంగా కొవిడ్ వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్ ఉన్నదని వారు తెలిపారు. స్పైక్‌లో నాలుగు అమైనో ఆమ్లాలున్నాయని, వీటికి పాజిటివ్ చార్జ్ ఉన్నదని, మానవ కణాలకు నెగెటివ్ చార్జ్ ఉన్నందున తేలిగ్గా చొరబడేందుకు వీలవుతుందని వారు పేర్కొన్నారు. అయితే, సహజంగా ఆవిర్భవించిన జీవుల్లో మూడు అమైనో ఆమ్లాలు ఉండటమే అరుదని, అలాంటపుడు నాలుగు అమైనోలు ఒకే వరుసలో ఉన్నాయంటేనే ఇది కృత్రిమ సృష్టి అని అర్థమవుతోందని వారు తమ పరిశోధనలోని కీలకాంశాన్ని వివరించారు. భౌతిక ధర్మాల ప్రకారం నాలుగు అమైనో ఆమ్లాలు ఒకే వరుసలో ఉండటం జరగదని డల్‌గ్లీష్ తెలిపారు.

ఈ వైరస్ వెలుగు చూడటానికి ఏడాది క్రితం నుంచే వుహాన్‌లోని ల్యాబ్‌లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పేరుతో రివర్స్ ఇంజినీరింగ్ పరిశోధనలు జరగడమే అందుకు ప్రాథమిక సాక్షమని వారు పేర్కొన్నారు. ల్యాబ్‌లో జరిగిన పరిశోధనల వివరాల్ని దాచి పెట్టడం, వాటిని బహిర్గతపరుస్తారని అనుమానించిన శాస్త్రవేత్తల్ని కనిపించకుండా చేయడం కూడా బలం చేకూర్చే సాక్షమేనని వారు పేర్కొన్నారు. 22 పేజీల ఈ పరిశోధనా పత్రం వైజ్ఞానిక పత్రిక క్వార్టర్లీ రివ్యూ ఆఫ్ బయోఫిజిక్స్ డిస్కవరీలో ప్రచురితం కానున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News