పుడమి తల్లిని రక్షించుకోడానికి ప్రకృతి వ్యవసాయం
ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లు ( చెరువుల తవ్వకం)
చెరువుల పూడిక తీయడంతో జలసంరక్షణ
గుజరాత్ మహాపటోత్సవ్ కార్యక్రమంలో మోడీ సూచనలు
అహ్మదాబాద్ : కరోనా వైరస్ ఉధ్ధృతి తగ్గినట్టు కనిపిస్తున్నా అదింకా అంతరించిపోలేదని , మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. అందుకే కరోనాపై చేస్తున్న పోరులో ఎట్టి పరిస్థితుల్లోను అలసత్వం వహించ వద్దని హెచ్చరించారు. ఎన్నో రూపాలను మార్చుకుంటున్న మహమ్మారి మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో ఎప్పటికీ తెలియదన్నారు. ఇటువంటి కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటివరకు 185 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామన్న ఆయన , ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమైందన్నారు. అయితే అత్యంత వేగంగా సంక్రమిస్తోన్న ఎక్స్‌ఈ వేరియంట్ గుజరాత్‌లో వెలుగు చూసిన నేపథ్యంలో మోడీ మరోసారి అప్రమత్తం చేశారు. గుజరాత్ లోని జునాగడ్ జిల్లాలో వంథలిలో మా యుమియా ధామ్ కు సంబంధించిన మహాపటోత్సవ్ కార్యక్రమంలో వర్చువల్ పద్ధతితో మోడీ ఈ విధంగా మాట్లాడారు. మా యుమియా ధామ్ ఆలయ 14 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.
కడ్వాపటీదార్ సమాజానికి చెందిన దేవత మా యుమియా. మా యుమియా భక్తులు పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లల సంరక్షణకు అలాగే ఎనీమియాతో బాధపడుతున్న తల్లుల ఆరోగ్య భద్రత కోసం గ్రామస్థాయిలో ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్న మా యుమియా ట్రస్టు పిల్లల ఆరోగ్యం ప్రోత్సహించే విధంగా గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించారు. ఇదే సమయంలో మాతృభూమిని రసాయన ఎరువుల నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కడ్వాపటీదార్ రైతులకు ఉద్ఘాటించారు. ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయానికి అంకితమైన గవర్నర్‌గా ఆచార్యదేవ్‌వ్రత్ గుజరాత్‌కు ఉన్నారని ఆయన తాలూకా స్థాయిలో వ్యవసాయ రైతుల సమావేశాలు నిర్వహించి ప్రకృతి వ్యవసాయం వైపు చైతన్యం కలిగించడంతో గుజరాత్‌లో లక్షలాది మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మళ్లించగలిగారని మోడీ ఉదహరించారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న అజాద్‌కీ అమృతోత్సవ్‌లో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్‌లు (చెరువులు) సృష్టించాలని సూచించారు. లక్షలాది చెక్‌డామ్‌లు కట్టే మీకు చెరువులు నిర్మించడం పెద్ద సాహసమేదీ కాదని ప్రజలను ఉద్దేశించి సూచించారు. జలసంక్షోభంతో బాధపడుతున్నప్పటికీ జలసంరక్షణ విధానాలను అనుసరించడం మరిచిపోరాదన్నారు. ప్రతి సంవత్సరం రుతుపవనాలకు ముందుగా చెరువుల పూడిక తీయడం, నీటికాలువలు శుభ్రం చేయడం, తదితర విధానాలతో జలసంరక్షణ చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.