అప్రమత్తత కొనసాగించాలి
‘మన్ కీ బాత్’లో ప్రధాని హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. 83వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, కొవిడ్ 19 మహమీఆ్మరి ఇంకా అంతం కాలేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ వైరస్ రూపాంతరం ఒమిక్రాన్ ను గుర్తించడంతో ప్రపంచ దేశాలు అందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి ఇంకా ఉందనే విషయాన్ని మరిచి పోవద్దని హెచ్చరించారు. దీనితో పాటుగా ప్రధాని తన మన్ కీ బాత్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఇది స్టార్టప్‌ల శకం అని ఆయన అంటూ, ఈ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రభాగాన ఉందని, 70కి పైగా స్టార్టప్‌లు వంద కోట్ల డాలర్ల విలువను దాటి పోయాయని చెప్పారు. భారీ సంఖ్యలోయువ జనాభా ఉన్న ఏ దేశంలోనైనా ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు, రిస్క్ తీసుకోవడానికి వెనుకాడక పోవడం, మేము చేయగలం అనే స్ఫూర్తి అనే ఈ మూడు అంశాలు దేనినైనా సాధించగలవని, మన దేశానికి ఇవి పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ఏడాదికేడాది స్టార్టప్‌లలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఇవి శరవేగంగా పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత్ 1971 డిసెంబర్ 16న విజయం సాధించిందని, ఈ విజయానికి సంబంధించిన 50వ వార్షికోత్సవాలను వచ్చే డిసెంబర్ 16న జరుపుకుంటామన్నారు. డిసెంబర్‌లో దేశం నావికా దినోత్సవాలు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే జరుపుకొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మన సాయుధ దళాలను, సైనికులను తాను స్మరించుకుంటున్నానని అన్నారు. మరీ ముఖ్యంగా ఈ హీరోలకు జన్మనిచ్చిన తల్లులను గుర్తు చేసుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ ఇద్దరు లబ్ధిదారులతో మోడీ మాట్లాడారు. ఈ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధి పొందారు. ప్రాణ రక్షక చికిత్సను పొందారు. డిసెంబర్ 6న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు నివాళులర్పించారు. ప్రకృతిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని తన ప్రసంగంలో చెప్పారు.ప్రకృతి సమతుల్యతకు విఘాతం కల్పించినప్పుడు, దాని స్వచ్ఛతను నాశనం చేసినప్పుడు మాత్రమే అది మనకు ముప్పు కలిగిస్తుందన్నారు. ప్రకృతి మనల్ని తల్లిలా అనుసరిస్తుందని, నూతన వర్ణాలతో ప్రపంచాన్ని నింపుతుందన్నారు.