పర్వతారోహకుడికి కరోనాతో అలర్ట్
ఖాట్మండ్: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరానికీ కరోనా తాకింది. నార్వేకు చెందిన ఎవరెస్ట్ పర్వతారోహకుడు ఎర్లెండ్ నెస్‌కు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని స్వయంగా వెల్లడించారు. అయితే, ఆయన ఆ విషయాన్ని ఆలస్యంగా మీడియాకు తెలిపారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి హెలికాప్టర్‌లో ఖాట్మండ్ వెళ్లిన తర్వాత ఏప్రిల్ 15న తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని, 22న నెగెటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. తాను కోలుకొని నేపాల్‌లోనే తన కుటుంబంతో ఉంటున్నట్టు తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో పర్వతారోహకులు, గైడ్లకు ఎవరెస్ట్ గైడ్ ఆస్ట్రీలుకాస్ ఫుర్టెన్‌బ్యాక్ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక జారీ చేశారు. వారాలపాటు పలువురితో ఎర్లెండ్ సన్నిహితంగా ఉన్నందున మరికొందరికి కరోనా సోకి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బేస్‌క్యాంప్‌లో ఉన్నవారంతా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మే నెలలో పర్వతారోహకులు అధిక సంఖ్యలో రానున్నందున కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.