కొవిడ్ ఆంక్షలు డిసెంబర్ 31 వరకూ పొడిగింపు
అప్రమత్తగా ఉండండి, మార్గదర్శకాలను కఠినంగా పాటించండి
ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు హోం శాఖ ఆదేశాలు
రాష్ట్రాల అధికారులతో ఆరోగ్య శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తగ్గుమఖం పడుతున్నట్లు కనిపించిన కొవిడ్ మహమ్మారి భయాలు.. ఒమిక్రాన్ రూపంలో మళ్లీ గుబులు రేపుతున్నాయి. దక్షిణాఫ్రికాలు తొలి సారి వెలుగు చేసి పలు ప్రపంచ దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలను డిసెంబర్ 31 వరకు పొడిగించింది.ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించింది. ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆ లేఖలో సూచించారు. ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని ఆ సమావేశంలో సూచించారు. విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా స్క్రీనింగ్, టెస్టింగ్ చేయాలని సూచించారు.
అలాగే వారు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్ చేసి వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. విదేశాలనుంచి వచ్చే వారిలో ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ అయితే వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపాలని ఆదేశించారు. మరోవైపు కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ తక్షణమే ప్రజారోగ్య చర్యలను చేపట్టాలని ఆదేశించారు. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్ కట్టడి చర్యలను డిసెంబర్ 31 వరకు కొనసాగించాలని ఆయా రాష్ట్రాలను అదేశించారు. దేశంలో ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్ వెలుగు చూడలేదని, అయినప్పటికీ అవసరమైన స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు, హోం ఐసొలేషన్ ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. ఆందోళనకర కొత్త వేరియంట్‌తో భారత్‌కు మరోసారి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సమర్థవంతమైన కట్టడి చర్యలు, క్రియాశీల పర్యవేక్షణ, పరీక్షల పెంపు, హాట్‌స్పాట్‌ల గుర్తింపు, ముమ్మర వ్యాక్సినేషన్, ఆరోగ్య మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచుకోవడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
Covid 19 Restrictions extended till 31 in India