Friday, November 22, 2024

భారత్‌లో కొవిడ్ మూడోదశ ముప్పు సంకేతాలు

- Advertisement -
- Advertisement -

Covid-19 third wave Signs in India న్యూఢిల్లీ : భారత్‌లో కొవిడ్ మూడో దశ ముప్పు వేగంగా ముంచుకొస్తోంది. ఒకరోజు కేసులు తగ్గడం మరో రోజు పెరగడం ఇలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న 30 వేలకు పడిపోయిన కేసులు నేడు (బుధవారం) 42 వేలకు పెరిగాయి. కొన్ని రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలు తక్కువగా ఉంటున్నాయి. వ్యాక్సినేషన్ భారీ ఎత్తున చేపట్టిన బ్రిటన్ వంటి చోట్ల ఇప్పుడు థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక్కవారంలో 40 శాతం కేసులు పెరిగాయి. మనదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి. కేరళలో థర్డ్ వేవ్ మొదలైందన్న అనుమానాలు బలంగా ఉంటున్నాయి. మహారాష్ట్రలో కూడా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు 8 వేల నుంచి 10 వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ ల్లో కూడా ఈ రాష్ట్రాలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయి.

కేరళలో కాంటాక్ట్ ట్రేసింగ్‌ను పూర్తిగా వదిలేయడం ప్రమాదకరంగా మారిందని ఎపిడమోలజిస్టులు పేర్కొంటున్నారు. దీంతో కుటుంబంలో ఒకరి నుంచి మిగిలిన అందరికీ వ్యాధి సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. థర్డ్ వేవ్ విషయం మరో 15 21 రోజుల్లో స్పష్టంగా తెలిసిపోతుందని అంటున్నారు. దేశం లోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సెకండ్‌వేవ్‌లో కేసులు ఏ విధంగా పెరిగాయో అలాంటి ట్రెండే థర్డ్ వేవ్‌లో కూడా కనిపించ వచ్చని అంచనా వేస్తున్నారు. 1918 లో వచ్చిన స్పానిష్ ప్లూతో కరోనాను ఇప్పుడు పోల్చి వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పానిష్ ఫ్లూ థర్డ్ వేవ్, ఫస్ట్‌వేవ్ దాదాపు ఒకేలా ఉన్నాయని, సెకండ్ వేవ్ మాత్రం ప్రళయాన్ని తలపించిందని బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి పరిశోధకులు భావిస్తున్నారు. కొవిడ్ విషయంలో అలా జరగవచ్చని చెబుతున్నారు. రద్దీగా ఉండే ప్రధాన పట్టణాల్లోని ప్రజలు ఇప్పటికే కొవిడ్ ప్రభావానికి గురి కావడంతో వ్యాప్తి తీవ్రత తగ్గవచ్చు.

ఢిల్లీలో దాదాపు 70 శాతం మందిలో యాంటీబాడీలు కనిపిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ముంబైలో టీఐఎఫ్‌ఆర్ టీమ్ సర్వేలో 80 శాతం మంది వైరస్ ప్రభావానికి గురైనట్టు గుర్తించారు. రానున్న మూడు నెలలే థర్డ్‌వేవ్ లో కీలకమని నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ సూచించారు. భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడానికి చాలా దూరంలో ఉందని వెల్లడించారు. జులై 4 వ తేదీనే భారత్‌లో థర్డ్ వేవ్ మొదలైందని హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ విపిన్ శ్రీవాస్తవ అంచనా వేశారు. ఆగస్టు చివరినాటికి థర్డ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తుందని ఐసిఎంఆర్ అంచనా వేసింది. యుబిఎన్ సెక్యూరిటీస్, ఎన్‌బిఐ రీసెర్చి బృందాలు కూడా ఆగస్టులో థర్డ్ వేవ్‌కు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాయి. థర్డ్‌వేవ్ రాడానికి చాలా అవకాశాలు ఉన్నాయని, రోగనిరోధక శక్తిని తప్పించుకునే మ్యూటెంట్ వస్తే పరిస్థితి కష్టమే అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News