Tuesday, November 5, 2024

దీపావళి వేళ థర్డ్‌వేవ్ హెచ్చరికలు బేఖాతర్..!

- Advertisement -
- Advertisement -

Covid-19 Third wave warning for Diwali

కొవిడ్ నిబంధనలకు పాతరేస్తున్న జనం
మాస్క్ ధరించడానికి 2 శాతం
భౌతిక దూరం పట్ల 3 శాతంలోనే ఆసక్తి:  లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: కొవిడ్19 కట్టడికి నిపుణులు సూచించిన మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడంలాంటి నిబంధనల పట్ల దేశవ్యాప్తంగా నిర్లక్ష్యధోరణి నెలకొన్నదని తాజా సర్వేలో వెల్లడైంది. మరో రెండు రోజుల్లో దీపావళి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోకల్ సర్కిల్స్ తమ సర్వే నివేదికను వెల్లడించింది. కేవలం రెండు శాతం మాత్రమే మాస్క్ ధరించడం పట్ల, 3 శాతం మాత్రమే భౌతిక దూరం పాటించడం పట్ల ఆసక్తి చూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. లోకల్ సర్కిల్స్ సంస్థ 366 జిల్లాల్లో 20,000మందిపై డిజిటల్ సర్వే చేసి 39,000 స్పందనలను వారి నుంచి తీసుకొని విశ్లేషించింది. టైర్1 జిల్లాల నుంచి 47 శాతం, టైర్2 జిల్లాల నుంచి 30 శాతం, టైర్3, 4, గ్రామీణ జిల్లాల నుంచి 23 శాతం స్పందనలు తీసుకున్నామని లోకల్ సర్కిల్స్ పేర్కొన్నది. మొత్తమ్మీద 65 శాతం పురుషుల నుంచి, 35 శాతం మహిళల నుంచి స్పందన తీసుకున్నారు.
ఈ ఏడాది జూన్ నుంచి ఈ సంస్థ సర్వే ప్రారంభించింది.

తమ మొదటి నివేదికను కేంద్ర ఆరోగ్యశాఖతో పంచుకున్నది. జులై 6న ఆరోగ్యశాఖ వెల్లడించిన ఆ నివేదిక ప్రకారం 29 శాతం మాస్క్ ధరించడం, 11శాతం సామాజిక దూరం పాటించడం చేస్తున్నారని తేలింది. తాజాగా సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వేలో వీరి సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం తమ ప్రాంతాల్లో 90 శాతానికిపైగా మాస్క్‌లు ధరిస్తున్నారని కేవలం 2 శాతంమంది మాత్రమే చెప్పారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల్లో మాత్రం మాస్క్‌లు ధరిస్తున్నారని 16 శాతంమంది తెలిపారు. సామాజిక దూరం విషయంలో కొన్ని ప్రాంతాల్లో 3 శాతం, మరికొన్ని ప్రాంతాల్లో 6 శాతం సానుకూలత వ్యక్తమైంది. ప్రజల్లో ఈ నిబంధనల పట్ల ఇప్పుడు ఆసక్తి తగ్గడానికి కారణం సామాజిక జీవనంలో ఆచరణసాధ్యం కాదన్న భావన బలపడటమేనని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా అన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో షాపింగ్ కోసం, ఇతర సంప్రదాయిక కార్యక్రమాల కోసం బయటకు వస్తున్నందున జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా కొత్త వేరియంట్ ద్వారా కొవిడ్19 మరోసారి విజృంభించి థర్డ్‌వేవ్‌కు దారితీసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News