40 కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైలు రాయిని అధిగమించింది. దేశ వ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం ఒక్క రోజే 21,18,682 మందికి తొలిడోసు ఇవ్వగా, 2,33,019 మందికి రెండో డోసు ఇచ్చారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 40.49 కోట్ల మందికి టీకా డోసులు ఇచ్చినట్టయింది. ప్రపంచం లోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ భారత్‌లో ప్రారంభించి ఇప్పటికి ఆరు నెలలు పూర్తయింది. కానీ ఇప్పటివరకు దేశ జనాభాలో కేవలం ఆరు శాతం మందికే రెండు డోసులు లభించాయి.
ప్రస్తుతం రోజుకు సగటున 40 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి 70 శాతం మంది ప్రజలకు టీకా వేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఆ లక్షం సాధించాలంటే రోజుకు 85 లక్షల నుంచి 90 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. జనవరిలో ప్రారంభమైన ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో టీకా డోసుల సరఫరా తగ్గిపోయి, కొత్త వ్యాక్సిన్లకు అనుమతులు లభించడం ఆలస్యం కావడంతో కొన్ని నెలల పాటు మందకొడిగా సాగింది.ప్రస్తుతం ఒక డోసు వేసుకున్న వారు జనాభాలో 17 శాతం వరకు ఉన్నారు. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 135 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది.
covid-19 vaccination exceeds 40 crore mark in india