సిడిసి అధ్యయనం వెల్లడి
వాషింగ్టన్ : కరోనా టీకా తీసుకున్న తరువాత కూడా వైరస్ సోకితే తీవ్ర ప్రమాదం ఏమీ ఉండదని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అయితే వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారికి బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ వల్ల ముప్పేనని తాజా అధ్యయనంలో తేలింది. ఇలాంటి బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవలసిన అవసరం వస్తోందని అమెరికా సిడిసి అధ్యయనం వెల్లడించింది. బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ల ప్రభావాలను అంచనా వేసేందుకు అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం (సిడిసి) అధ్యయనం చేపట్టింది. ఆగస్టు 30 వ తేదీ నాటికి దాదాపు 12,908 బ్రేక్‌త్రూ కేసులను పరిగణన లోకి తీసుకుంది. బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ తరువాత ఆస్పత్రి పాలైన వారిలో 70 శాతం మంది 65 ఏళ్లకు పైబడిన వారేనని సిడిసి పేర్కొంది. అంతేకాకుండా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ సమస్యలతో మరణించిన వారిలో దాదాపు 87 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారేనని వెల్లడైంది.