సీరో సర్వేలో వెల్లడి
ముంబయి: ముంబయిలో 51.18 శాతంమంది చిన్నారుల్లో కొవిడ్19 యాంటీబాడీలున్నట్టు సీరో సర్వేలో వెల్లడైందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బిఎంసి) ఓ ప్రకటనలో తెలిపింది. ముంబయిలోని 24 వార్డుల్లో ఈ శాంపిల్ సర్వే నిర్వహించినట్టు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు 1 నుంచి 18 ఏళ్ల చిన్నారుల నుంచి 2176 శాంపిళ్ల రక్తాన్ని సేకరించి సీరమ్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన తర్వాత ముంబయిలో సీరో సర్వే నిర్వహించడం ఇది మూడోసారని బిఎంసి తెలిపింది.
ముంబయిలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ లేబోరేటరీలు శాంపిళ్లను సేకరించాయని తెలిపింది. 1283 శాంపిళ్లను ప్రభుత్వ ల్యాబ్‌లు, 893 శాంపిళ్లను ప్రైవేట్ ల్యాబ్‌లు సేకరించాయి. ప్రభుత్వ శాంపిళ్లలోని 54.36 శాతం మందిలో, ప్రైవేట్ శాంపిళ్లలోని 47.03 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. వయసులవారీగా చూస్తే 1014 ఏజ్ గ్రూప్ వారిలోని 53.43 శాతంలో యాంటీబాడీలున్నాయి. 14ఏజ్ గ్రూప్‌లో 51.04శాతం,5 9 ఏజ్‌గ్రూప్‌లో 47.33 శాతం, 1518 ఏజ్‌గ్రూప్‌లో 51.39 శాతం మందిలో యాంటీబాడీలున్నాయి. 18 ఏళ్లలోపువారిలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన శాంపిల్ సర్వేలో 39.4మందిలో మాత్రమే యాంటీబాడీలుండగా, ఇప్పుడది 51.18 శాతానికి పెరిగిందని బిఎంసి పేర్కొన్నది. సెకండ్‌వేవ్‌లో చిన్నారులు కూడా గణనీయ సంఖ్యలోనే కొవిడ్ బారిన పడినప్పటికీ వారిలో అది తీవ్ర లక్షణాలను కలిగించలేకపోయిందని ఈ శాంపిల్ సర్వే ద్వారా స్పష్టమవుతోంది.