Monday, December 23, 2024

ఇంటింటికి ‘బూస్టర్’

- Advertisement -
- Advertisement -

ఉద్యమంగా టీకా కార్యక్రమం,ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి

వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వ్యాధులకు చికిత్స
డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
మంకీపాక్స్‌పై ఆందోళన వద్దు
ఈ వ్యాధికి ఫీవర్ హాస్పిటల్‌లో చికిత్స…
గాంధీలో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు
అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశం
కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మంత్రులు, ఉన్నత అధికారులు, కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్

మనతెలంగాణ/హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి. హరీశ్ రావు పేర్కొన్నారు. అన్ని వ్యాధులకు ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. వ్యాధుల బారినపడిన ప్రజలు ప్రైవేటుకు వెళ్లవద్దని, ప్రభుత్వాసపత్రు ల్లో చికిత్స తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పం చాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యా శాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి, ఎస్‌సి అభివృద్ధి శాఖ మంత్రి కొ ప్పుల ఈశ్వర్, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లతో కలిసి మంత్రి హరీశ్‌రావు సోమవారం బిఆర్‌కెఆర్ భవన్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీఓలు, డీఎంహెచ్‌ఓలు, ఇత ర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పెరుగుతున్న సీజనల్ వ్యాధులు, రెసిడెన్షియ ల్ పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార భద్రత చర్యలు, పాఠశాలలు, హాస్టళ్లలో కొవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మం త్రి మాట్లాడారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరిగిన నేపథ్యంలో ప్లేట్‌లెట్లు తగ్గాయంటూ ప్రైవే టు ఆస్పత్రులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సమాధానంగా మంత్రి, డెంగ్యూ చికిత్సకు అవసరమైన అన్ని సౌకర్యాలను జిల్లా ఆస్పత్రుల్లో ఉన్నాయని స్పష్టం చే శారు. ప్రజలు ప్రభుత్వాస్పత్రులను ఉపయోగించుకోవాలని కో రారు. మిషన్ భగీరథతో పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల గతంతో పోలిస్తే మలేరియా, సీ జనల్ వ్యాధులు తగ్గుము ఖం పట్టాయని అన్నా రు. నమోదవుతున్న వ్యాధులకు చికిత్స అందించే పూర్తి ఏర్పాట్లు చేశామని చె ప్పారు. దోమల నివారణకు ప్రభుత్వం అన్ని చర్య లు చేపడుతుంద న్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఏజెన్సీ ప్రాంతాలలో ప్రభుత్వం దోమతెరలను పంపిణీ చేసిందనీ, ప్రజలు వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు కాచి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. డెంగ్యూ కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో అధికంగా ఉన్నందున, ఈ జిల్లాల్లో వ్యాధుల నియంత్రణకు కుటుంబ, ఆరోగ్య సంక్షేమ కమిషనర్ డాక్టర్ శ్వేతా మహంతిని ప్రత్యేక అధికారిగా నియమించినట్టు మంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల అనుసంధాన పునరుద్ధరణ కోసం రోడ్లు, భవనాలశాఖకు రూ.10 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.10 కోట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ నిధులు విడుదల చేశారని వెల్లడించారు.

కలెక్టర్లు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు హాస్టళ్లను తనిఖీ చేయాలి

సంక్షేమ వసతి హాస్టళ్లలో తరచూ నీటి కాలుష్యం, ఆహార కాలుష్యంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సమీక్షించినట్టు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఫుడ్ ఇన్ స్పెక్టర్లు విధిగా ఆయా హాస్టళ్లను సందర్శించి ఆహారం, నీటిని తనిఖీ చేయాలని ఆదేశించామన్నారు. కలెక్టర్లు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులకు పెట్టే భోజనాన్ని పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆహార నాణ్యత ఉండేలా పౌరసరఫరాలశాఖ మంత్రితో పాటు అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరారు. గురుకులాల్లో నాణ్యత లేని బియ్యం ఉంటే వెంటనే వెనక్కి తీసుకుని నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కోరినట్టు మంత్రి తెలిపారు.

ఇంటింటికి బూస్టర్ డోసు

నెల రోజుల్లో రాష్ట్రంలో అందరికీ కొవిడ్ బూస్టర్ డోస్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అక్కడక్కడా కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అన్ని విద్యాసంస్థల్లో అర్హులైన వారికి బూస్టర్ డోసు వేసే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యమై ఉద్యమంలా కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణ, కొవిడ్ బూస్టర్ డోస్ విషయంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.

కువైట్ నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు

మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల కువైట్ నుంచి ఇబ్రహీం(35) అనే వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే ఫీవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ నెల 6వ తేదీన అతను కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చారని, 20వ తేదీ నుంచి ఆయనకు జ్వరం, మొహం, చేతులపై మచ్చలు వంటి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతన్ని ఫీవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అతని నుంచి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. సోమవారం లేదా మంగళవారం అతనికి మంకీపాక్స్ సోకిందా లేదా అనే విషయం తెలుస్తుందని అన్నారు. మంకీపాక్స్ చికిత్సకు ఫీవర్ ఆసుపత్రిని ఇప్పటికే నోడల్ ఆసుపత్రిగా ప్రకటించామని, అలాగే గాంధీ ఆసుపత్రిలో టెస్టింగ్ చేసేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అతనికి మంకీపాక్స్ నిర్ధారణ అయితే అతనికి సన్నిహితంగా మెలిగిన వారికి కూడా తగిన చికిత్స అందిస్తామని తెలిపారు.

బాగా ఉడకని మాంసం, మంకీపాక్స్ సోకిన వ్యక్తి సన్నిహితంగా ఉండటం, అతని శరీరద్రవ్యాలు, వాడిన వస్త్రాలను ఇతరులు వాడటం వంటి చర్యల ద్వారా ఈ వ్యాధి విస్తరిస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు. విదేశాలు, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో పరీక్షలు చేసేలా ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరామని హరీష్ రావు తెలిపారు. ముఖ్యంగా ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారిలో ఎక్కువగా మంకీపాక్స్ అనుమానిత లక్షణలు కనిపిస్తుండటంతో వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. టిఎస్‌ఎంఐడీసీ ద్వారా మంకీపాక్స్ పరీక్షల కిట్లను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ నిల్వ ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఒకవేళ అలాంటి కొరత ఉంటే తీర్చేందుకు ప్రయత్నిస్తామని హరీశ్ రావు చెప్పారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కొరతపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, అలాంటి పరిస్థితి లేకుండా చూస్తామని చెప్పారు.

ఫ్రై డే డ్రై డే పాటించాలి

సీజనల్ వ్యాధుల కేసులు పెరుగుతున్నందున, అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర సంస్థలలో శుక్రవారం డ్రై డే వంటి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి హరీశ్ రావు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోరారు. అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల నిడివిగల ప్రత్యేక ప్రచారాన్ని కూడా పునరుద్ధరించాలని మంత్రి కోరారు. సాధారణ పారిశుద్ధ్యం, డ్రైన్ క్లీనింగ్, దోమల నివారణ చర్యలను ముమ్మరం చేసేందుకు మున్సిపల్ కమిషనర్లు చురుగ్గా పాల్గొనేలా చూడాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. దోమలు, లార్వా నిరోధక చర్యలను వేగవంతం చేయాలని, నీటి ఎద్దడి నివారణ, డ్రైన్ క్లీనింగ్, చెత్త ఎత్తివేయడం, స్థానిక గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య కమిటీలు, ఆరోగ్య సిబ్బందిని క్రియాశీలం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను కోరారు. బోరు బావుల పరిసర ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, కుళాయి, బోరు బావుల వద్ద సరైన నిర్వహణ కూడా ఉండేలా చూడాలని తెలిపారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, హాస్టల్ పరిశుభ్రత, పారిశుధ్యం, పరిశుభ్రత వంటి విషయాల్లో హాస్టల్ వార్డెన్లు బాధ్యత వహించాలని, అలాగే పారిశుద్ధ్య సిబ్బంది పనిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో ప్రతిరోజు పారిశుధ్యం చేపట్టాలని ఎస్‌సి అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, హాస్టళ్లలో సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతపై కలెక్టర్‌లు పాఠశాలలు, హాస్టళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. పాఠశాలలు, హాస్టళ్ల పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి ప్రతి సంస్థకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.

వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జిల్లా కలెక్టర్లు కృషి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను అభినందించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్‌సి డెవలప్‌మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రోనాల్ రోస్, సీడీఎంఏ సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వైద్య శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News