న్యూయార్క్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం
న్యూయార్క్: ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ అల్లుకు పోతే మరణానికే దారి తీస్తుందని న్యూయార్క్ యూనివర్శిటీ (ఎన్వైయు)గ్రాస్మేన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. కొవిడ్ 19 తో మృతి చెందిన వారి ఊపిరి దిగువ నాళాల్లో సరాసరిన పది రెట్లు ఎక్కువగా వైరస్ పేరుకుపోయి ఉండడం గమనించామని పరిశోధకులు వెల్లడించారు. జర్నల్ నేచర్ మైక్రోబయోలజీ లో వెలువడిన ఈ అధ్యయనం ఇదివరకటి సిద్ధాంతాలకు విరుద్ధమైనదిగా చెప్పవచ్చు. ఏకకాలంలో సంభవించే బ్యాక్టీరియా నిమోనియా లేదా శరీరం లోని రోగ నిరోధక శక్తి అతిగా స్పందించడం మరణానికి దారి తీస్తుందని ఇదివరకటి సిద్ధాంతాలు వివరించాయి.
ద్వితీయ స్థాయిలో సంభవించే బ్యాక్టీరియా వల్ల మరణించడం జరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పరిశోధకులు వివరించారు. రోగులు తీవ్రంగా అస్వస్థులైనప్పుడు యాంటీబయోటిక్స్ విపరీతంగా వాడడం వల్లనే అలాంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ఎక్కువ సంఖ్యలో వైరస్ ఊపిరితిత్తులకు సోకడానికి, మరణానికి దారి తీయడానికి శరీర వైఫల్యమే కారణమని తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు ఇమ్రాన్ సులేమాన్ వివరించారు. వెంటిలేషన్‌పై ఉన్న తీవ్ర అస్వస్థులైన రోగులకు రెమెడెసివిర్ వంటి యాంటీవైరల్స్‌ను వినియోగించరాదని సిడిసి ప్రస్తుత మార్గదర్శకాలు చెబుతున్నాయని, అయితే ఈ యాంటీవైరల్ ఔషధాలు రోగులను క్లిష్టపరిస్థితుల్లో ఆదుకునే సాధనాలని తెలుసుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు.