న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్‌తో చనిపోయారని కేంద్రం వెల్లడించింది. క్రియాశీల కేసుల సంఖ్య 3919 కి చేరింది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన కార్యక్రమాలను రద్దు చేసినట్టు రాజ్‌భవన్ తెలియజేసింది. ఆయన రాజ్‌భవన్‌లోనే క్వారంటైన్‌లో ఉన్నారని, చికిత్స అవసరం లేదని వైద్యులు సూచించారని అధికారులు వివరించారు.
జెఎన్.1 కేసుల కలకలం
దేశంలో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో కలకలం కలుగుతోంది. మొత్తం 12 రాష్ట్రాలు కలిపి 819 జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 250, కర్ణాటకలో 199, కేరళలో 148 కేసులు వెలుగు లోకి వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఈ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.