ఒక్కరోజులోనే 50 శాతం అధికమైన కేసులు
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు
ముంబయి: మహారాష్ట్రలో కొవిడ్19 కేసులు భారీగా పెరగడం పట్ల ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి రాజేశ్‌టోపే ఆందోళన వ్యక్తం చేశారు. అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నియంత్రణ మార్గదర్శకాలు పాటించాలని అధికారులు, ప్రజలకు సూచించారు. వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. 810 రోజుల క్రితం రాష్ట్రంలో క్రియాశీలక కేసులు 50006000 మధ్యన ఉండగా, ఇప్పుడవి ఒక్కసారిగా పెరిగాయన్నారు. డిసెంబర్ 10న యాక్టివ్ కేసులు 6543గా నమోదయ్యాయి. మంగళవారం క్రియాశీలక కేసులు 11,492కాగా, బుధవారం వాటి సంఖ్య 20,000కు పైగా నమోదైంది. డబ్లింగ్ రేట్ కూడా ఆందోళనకరంగా ఉన్నదని టోపే తెలిపారు. ఒక్కరోజులోనే 50 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. ముంబయిలో కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు.
మంగళవారం ముంబయిలో యాక్టివ్ కేసులు 1377 కాగా, అవి బుధవారం 2200కు చేరుకోనున్నాయి. రోజూ ముంబయిలో 51,000మందికి పరీక్షలు నిర్వహిస్తుండగా, 2200మందికి కొవిడ్ నిర్ధారణ అవుతున్నదని, దీంతో రోజువారీ పాజిటివిటీ రేట్ 4 శాతం దాకా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల్ని వ్యాక్సినేషన్‌కు ప్రోత్సహించాల్సిందిగా రాజకీయ నేతలు, మతపెద్దలు, స్వచ్ఛంద సంస్థల్ని టోపే కోరారు. మంగళవారం మహారాష్ట్రలో 2172కేసులు నమోదు కాగా, అంతకుముందురోజు 1426 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్కరోజులోనే కేసులు 50 శాతంమేర పెరిగాయి. మహారాష్ట్రలో ఈ నెల 28వరకు 66,61,486 కేసులు, 1,41,476 మరణాలు నమోదయ్యాయి.