కొవిడ్ పరీక్ష, టీకా సర్టిఫికెట్ నుంచి మినహాయింపు
డెహ్రాడూన్ : మే 3 న ప్రారంభం కానున్న చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు మినహాయిస్తూ ఊరట కలిగించింది. కొవిడ్ పరీక్ష, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే యాత్రకు ముందు భక్తులు విధిగా రాష్ట్ర పర్యాటక పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఒకవైపు యాత్ర తేదీ సమీపిస్తుండటం, మరోవైపు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు కొవిడ్ నిబంధనల విషయంలో గందరగోళం నెలకొనడంతో సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ సూచనల మేరకు ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ సంధు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు యాత్రను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు దాదాపు 1.5 లక్షల మంది ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.