Monday, December 23, 2024

కొవిడ్ నష్టం రూ. 52 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

Covid loss of Rs. 52 lakh crore

ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే 12 ఏళ్లు
ఆర్‌బిఐ నివేదిక వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల వ్యవధిలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ.. ఎన్నడూ లేని విధంగా దెబ్బతింది. భారత ఆర్థిక వ్యవస్థపైనా కొవిడ్ ప్రభావం దారుణంగానే పడింది. అయితే.. కొవిడ్ సృష్టించిన అల్లకల్లోలం నుంచి పూర్తిగా కోలుకునేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు 12 ఏళ్లు పడుతుందని ఆర్‌బిఐ నివేదిక వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ ప్రభావం అనే అంశం మీద ’స్కార్స ఆఫ్ పాండెమిక్’ అనే పేరుతో ఆర్‌బిఐ ఈ నివేదికను రూపొందించింది.

కరోనా కాలంలో దేశానికి రూ. 52 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. 2020 మార్చిలో కొవిడ్ తొలిసారి దేశం తలుపుతట్టింది. ఫలితంగా ప్రభుత్వం లాక్‌డౌన్ అస్త్రాన్ని ప్రయోగించింది. ఇక కోలుకుంటున్న దశలో రెండో వేవ్ 2021 ఏప్రిల్‌లో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు మూడో వేవ్ కారణంగా 2022 జనవరిలో వ్యాపారాలు మళ్లీ మూతపడ్డాయి. ఇలా కొవిడ్ వేవ్‌లతో భారత జిడిపి వృద్ధి సైతం దెబ్బతిందని ఆర్‌బిఐ నివేదిక పేర్కొంది. కరోనాతో భారత్‌కు 2020-21లో రూ. 19.1లక్షల కోట్లు, 2021-22లో 17.1లక్షల కోట్లు, 2022-23లో 16.4లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది.

అయితే కరోనాకు అడ్డుకట్టవేసేందుకు ప్రయోగించిన అస్త్రాల ఫలితాలు భవిష్యత్తులో దేశానికి అందుతాయని ఆర్‌బిఐ నివేదిక అభిప్రాయపడింది. కొవిడ్ ముందున్న ప్రపంచాన్ని తీసుకురావడం కష్టమని, కరోనా అనంతరం ఏర్పడిన మార్పులతోనే జీవించాలని స్పష్టం చేసింది. ఈ నివేదికను ఆర్‌బిఐకు చెందిన డిఇపిఆర్ (డిపార్టమెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్) రూపొందించింది. రిపోర్టులోని అంశాలు పూర్తిగా డిఇపిఆర్‌దేనని, తమకు సంబంధం లేదని ఆర్‌బిఐ వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన ఆదాయ నష్టం దాదాపు రూ.52 లక్షల కోట్లు అని అంచనా వేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ (ఆర్‌సిఎఫ్)లో ‘మహమ్మారి మచ్చలు’ అనే అధ్యాయంలో ఈ మహమ్మారి ప్రభంజనాలు పదే పదే రావడం వల్ల నిలకడగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆటంకాలు ఏర్పడినట్లు తెలిపింది. జిడిపి (స్థూల దేశీయోత్పత్తి)లో త్రైమాసిక ధోరణులు ఈ మహమ్మారి ఆటుపోట్లకు గురైనట్లు పేర్కొంది. 2020-21 తొలి త్రైమాసికంలో తీవ్రమైన క్షీణత నమోదైన తర్వాత 2021-22 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రెండో ప్రభంజనం వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థ వేగం క్రమంగా పుంజుకుందని తెలిపింది. అదే విధంగా 2022 జనవరిలో మూడో ప్రభంజనం వల్ల ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియకు పాక్షికంగా దెబ్బతగిలిందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News