ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త టెస్టింగ్ వ్యూహాన్ని అనుసరించాలి
భవిష్యత్ వేరియెంట్లపై ఇప్పుడే చెప్పలేం
ఐసిఎంఆర్ అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్. సమీరన్ పాండ
మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ నిబంధనలు విధిగా పాటిస్తే మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో భారత్ కొవిడ్ 19 -బారి నుంచి బయటపడుతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజీ, అంటువ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ సమిరన్ పాండా పేర్కొన్నారు. మనం ముందుగానే కరోనా నిబంధనలను గాలికొదిలేయకుండా జాగ్రత్తలు పాటిస్తే కొవిడ్ -19 ఎపిడెమిక్ నుంచి ఎండెమిక్‌గా మారుతుందని తెలిపారు. రాబోయే నాలుగు నుంచి ఆరు వారాల్లో పరిస్థితి నిలకడగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇంకా పుట్టుకురాబోయే వేరియంట్స్ స్వభావం గురించి మనకు తెలియకపోయినా ఆర్‌ఎన్‌ఎ వైరస్‌లు, ముఖ్యంగా సార్స్ – కోవ్ 2 విషయంలో నెల నుంచి నెలన్నరలో పరిస్థితి నిలకడగా ఉంటుందని చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మనం కొత్త టెస్టింగ్ వ్యూహాన్ని, కొవిడ్ -19 నిర్వహణ వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం నెలకొందని అన్నారు. దేశంలో రాబోయే రోజుల్లో కేసులు తగ్గుతాయనే విషయంలో అప్పుడే మనం ట్రెండ్‌ను అంచనా వేయలేమని, రాబోయే మూడు నుంచి నాలుగు వారాల్లో వైరస్ ధోరణిని పసిగట్టవచ్చని అన్నారు.
భారత్‌లో కొన్ని రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ స్థానంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తోందని చెప్పారు. ఢిల్లీ, ముంబై నగరాలతో పాటు తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రాబల్య స్ట్రెయిన్‌గా వ్యాపిస్తోందని అన్నారు. ప్రజల అప్రమత్తత, కేసుల గుర్తింపు నిజమైన సవాల్‌గా ముందుకొస్తోందని చెప్పారు. ఒమిక్రాన్ కేసుల్లో చాలావరకూ రోగులు ఆస్పత్రుల్లో చేరే అవసరం లేకపోవడం ఊరట కలిగించే పరిణామమని డాక్టర్ పాండా పేర్కొన్నారు.