బహుముఖంగా దెబ్బతీస్తున్న కొవిడ్
న్యూఢిల్లీ : కొవిడ్ కేవలం మనిషి ఊపిరితిత్తులను దెబ్బతీయడమే కాదు, దీని బారిన పడిన వారిలో రక్తం గడ్డకట్టడం వంటి క్లిష్ట పరిణామాలను కూడా తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకూ కరోనా అనగానే ఇది లంగ్స్ సంబంధిత ప్రాణాంతక వ్యాధి అనుకుంటూ వచ్చారు. కొవిడ్‌కు గురైన కొందరిలో తలెత్తిన పరిణామాల దశలో ఇతరత్రా ఈ వైరస్ తీసుకువస్తున్న ముప్పు అంశాలు వెలుగులోకి వచ్చాయి. గాలిలో నుంచి మనిషిలోపలికి చేరుకుని శారీరక వ్యవస్థను ప్రత్యేకించి ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ముప్పుగా కరోనాను భావిస్తూ వచ్చారు. అయితే ప్రమాదకరరీతిలో నెత్తురు గడ్డకట్టుకుపోవడం వంటి అవస్థలతో ఇతరత్రా అవయవాలకు ముప్పు ఏర్పడుతోంది. కొవిడ్ నుంచి ప్రాణాలను దక్కించుకున్నా , రక్తం గడ్డకట్టుకుపోయే పరిణామం కీలక అవయవాలు దెబ్బతినేలా చేస్తోందని, దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు తేల్చిచెపుతున్నారు. విశ్వవ్యాప్త కరోనాపై అన్ని దేశాల వారిగా సమగ్ర పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ దశలో కొందరు రోగులలో తలెత్తుతున్న బ్లడ్‌క్లాట్ తీవ్ర క్లిష్టతలకు దారితీస్తోందని గుర్తించారు. ఈ పరిణామాన్ని డీప్ వియిన్ త్రోంబోసిస్ (డివిటి)గా వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రుల పాలయిన కొవిడ్ రోగుల్లో ఇది దాదాపుగా 14 28 శాతం వరకూ ఉంటోంది. మరో రకం ముప్పు ఆర్టిరియల్ త్రోంబోసిస్ పరిణామం రెండున్నర శాతం కన్నా తక్కువ మంది రోగులలో ఉంటోంది. భారతదేశంలో కూడా రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడం వంటి పరిణామాలు ఎక్కువగా కొవిడ్ రోగులలో తలెత్తుతున్నాయి. రక్తనాళాలపై కరోనా పోటు ఇప్పుడు ఊపిరితిత్తులపై ప్రభావంతో సమాన ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు గుర్తించారు. ప్రతివారానికి కనీసం ఐదు నుంచి ఆరు వరకూ ఇటువంటి కేసులు తమ వద్దకు వస్తున్నాయని , ఒక్కరోజు అయితే అత్యధికంగా ఈ విధంగా ఎక్కువ మంది కరోనా రోగులు రక్తనాళాలు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయని సర్ గంగారామ్ హాస్పిటల్‌కు చెందిన వాస్కులర్, ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ అంబరీష్ సాత్విక్ తెలిపారు.
ఇక మధుమేహం వంటి జబ్బులు ఉన్నవారికి కరోనా తోడయితే ఇందులో ప్రత్యేకమైన షుగర్ తీవ్రత ఉంటే వారిలో ఉన్నట్లుండి రక్తనాళాలు మూసుకుపోతున్నట్లు గుర్తించారు. అయితే కొవిడ్ రోగులలో పలు క్లిష్ట పరిణామాలకు కారణాలు పూర్తిస్థాయిలో నిర్థారించుకోవల్సి ఉందని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు డాక్టర్ అమ్రిష్ కుమార్ తెలిపారు. కొవిడ్ వైరస్ లోపలికి చేరుకుని క్రమేపీ అదుపులేకుండా రక్తనాళాల ప్రవాహాన్ని అడ్డుకోవడం జరిగితే బలహీన స్థితిలో ఉండే వ్యక్తులకు గుండెపోటు , నొప్పి లేదా ఏదైనా శరీరక వైకల్యం ఏర్పడే ముప్పు ఉందని గుర్తించారు.