చలి తీవ్రతతో మళ్లీ వైరస్ రెక్కలు కట్టుకునే అవకాశం
ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించనున్న విద్యాశాఖ
దీపావళి తరువాత స్కూళ్లలో పెరిగిన విద్యార్ధుల సంఖ్య
వసతి గృహాలు, మధ్యాహ్నం బోజనం పథకం ప్రారంభం
హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో చలి తీవ్రత పెరగడంతో కరోనా వైరస్ విజృంభించే అవకాశ ఉందని వైద్యశాఖ హెచ్చరికలతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేసేలా ఆయా పాఠశాల నిర్వహకులు బాధ్యతలు చేపట్టే విధంగా ఆదేశాలివ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభించి విద్యార్థులు 60శాతానికి మించి హాజరుకాలేదు. గత 20 రోజుల నుంచి తరగతుల్లో విద్యార్ధుల సందడి నెలకొనడం, చలి పెరగడంతో మళ్లీ మహమ్మారి రెక్కలు కట్టుకుంటుంది భావిస్తున్నారు. అదే విధంగా సంక్షేమ పాఠశాల వసతిగృహాలు, మధ్యాహ్నం బోజనం పథకం ప్రారంభిస్తుండటంతో చిన్నారులంతా ఒకే దగ్గర గుంపులు చేరే పరిస్దితి ఉంటుందని, అందులో ఎవరికి దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే మిగతా వారికి సోకే చాన్స్ ఉంది అందుకోసం ముందుగా జాగ్రత్తలు పాటిస్తే కరోనా వేగానికి కళ్లెం వేయవచ్చంటున్నారు.
నగరంలో సెకండ్ వేవ్ కూడా నాగోల్ సంక్షేమ పాఠశాలకు చెంది ఒకేసారి 35మంది విద్యార్ధులకు సోకడంతో క్రమంగా వారం రోజుల్లో విస్తరించి స్కూళ్లు మూతపడేలా చేసింది. ఈవిద్యా సంవత్సరం విద్యార్థుల చదువులకు అటంకం రాకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తే విద్యార్ధులు ఆరోగ్యంగా ఉండి పాఠాలు వింటారని టీచర్లు పేర్కొంటున్నారు. కరోనా జాగ్రత్తలను బడిలో ప్రధానోప్యాధాయుడుకి అప్పగించి విద్యార్ధులు ఒకే దగర్గ చేరకుండా చూడటం మాస్కులు, ప్రవేశద్వారం వద్ద శానిటైజర్, వైరస్ లక్షణాలు కనిపిస్తే ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచేలా చూసుకోవాలి.అంతేగాకుండా తమ ప్రాంతానికి చెందిన ఆరోగ్య కార్యకర్తలతో వారానికోసారి విద్యార్దులకు టెస్టులు చేసేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయనున్నారు.
జిల్లాలో 689 ప్రభుత్వ పాఠశాలలుండగా 1.10లక్షలమంది, 1875 ప్రైవేటు స్కూళ్లో 7.20లక్షలమంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరైతున్నారు. వీరందరు సంక్షేమంగా ఉండాలని పాఠశాల నిర్వహకులు తగిన జాగ్రత్తలు పాటిస్తే చిన్నారులు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని విద్యాశాఖ పేర్కొంటుంది. కరోనా మహమ్మారి గత ఆరునెల నుంచి తగ్గుముఖం పట్టిన వాతావరణం మార్పులతో పాటు రోడ్లపై జనసంచారం పెరగడంతో థర్డ్‌వేవ్ రెక్కలు కట్టుకుంటుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలికాలం ముగిసేవరకు ముఖానికి మాస్కులు, బౌతికదూరం, శానిటైజర్ దగ్గర ఉంచుకోవాలని, దగ్గు, జలుబు లక్షణాలుంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి కరోనా టెస్టులు చేసుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు.