దుకాణాలు, మార్కెట్లో గుంపులుగా తిరుగుతున్న జనం
పాజిటివ్ కేసులు పెరుగుతున్న పట్టించుకునే నాథుడే లేదు
సంక్రాంతి పండగ పేరుతో పెద్ద ఎత్తున కొనుగోలు
అధికారులు హెచ్చరించిన అమలు కానీ కొవిడ్ నిబంధనలు
ప్రజలు నిర్లక్షంగా ఉంటే లాక్‌డౌన్ తప్పదని హెచ్చరికలు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో గత పదిరోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కొవిడ్ నిబంధనలు అమలు కనిపించడంలేదు. ఎక్కడ చూసిన జనం గుంపులుగా తిరుగుతూ వైరస్‌కు రెక్కలు తొడుగుతున్నారు. కొన్నిచొట్ల ముఖానికి మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా ఒకే దగ్గర గుంపులుగా చేరుతున్నారు. దీంతో మహమ్మారి వేగంగా విస్తరిస్తూ ప్రజలను ఆసుపత్రుల దారి పట్టిస్తుందని వైద్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు పాటించకుంటే జరిమానాలు వేస్తామని హెచ్చరించిన పట్టించుకునే అనాథుడే లేదని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయని, ఇదే విధంగా ప్రజలు మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, బార్లు, వైన్స్‌ల వద్ద గుంపులుగా ఉంటే థర్డ్‌వేవ్‌ను అదుపు చేయడం కష్టమని వైద్యాధికారులు అంటున్నారు.
స్దానిక అధికారులు నిబంధనలు పాటించాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన పెడచెవిన పెడుతున్నారని పేర్కొంటున్నారు. వైరస్ కేసులు పెరగడంతో రెండు రోజుల నుంచి ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరగడంతో గాంధీ ఆసుప్రతిలో సాధారణ సేవలు నిలిపివేసి, కోవిడ్ రోగులకు మాత్రమే వైద్య సేవలందిస్తామని అధికారులు ప్రకటించారు. అయిన గ్రేటర్ ప్రజలు మహమ్మారి పట్ల జాగ్రత్తలు పాటించడంలేదు. దగ్గు,జలుబు, జ్వరం లక్షణాలున్న సీజనల్ వ్యాధులుగా భావిస్తూ రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. గత వారం రోజు నుంచి నమోదైన పాజిటివ్ కేసులు పరిశీలిస్తే ఈనెల 6వ తేదీన 1214 కేసులు, ఈనెల 7న 1452మందికి, ఈనెల 8వ తేదీన 1583 పాజిటివ్ కేసులు, ఈనెల 9న 1165 మందిసోకగా, ఈనెల 10వ తేదీన 1042 కేసులు, ఈనెల 11న 1015 మందికి సోకినట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అదే పరిస్దితి ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగుతుందని, అప్పటివరకు ప్రజలు అత్యవసరాలకు తప్ప సరదా కోసం బయట తిరగవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరిగినప్పటి నుంచి సెలవులు పెట్టకుండా విధులకు హాజరైతూ ప్రజలకు అందుబాటులో ఉండి టెస్టులు, రోగులకు చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారు. కానీ గ్రేటర్ ప్రజలు వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించకుండా సంక్రాంతి పండగను ఘనంగా చేసుకునేందుకు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ మహమ్మారి పట్ల నిర్లక్షం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.