న్యూఢిల్లీ : దేశంలో కరోనా సబ్ వేరియంట్ జెఎన్.1మెల్లమెల్లగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశం మొత్తం మీద 312 కేసులు నమోదయ్యాయి. వీటిలో 47 శాతం కేరళలో నమోదు అయినట్టు ఇన్‌సాకాగ్ డేటా మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. కేరళలో 147,గోవాలో 51,గుజరాత్‌లో 34,మహారాష్ట్రలో 26.తమిళనాడులో 22,ఢిల్లీలో 16. కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5,తెలంగాణలో 2,ఒడిశాలో1 జెఎన్.1 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌లో దేశంలో కరోనా కేసులు 279 నమోదవ్వగా, వాటిలో 33 జెఎన్.1 కేసులు ఉన్నాయని ఇన్‌సాకాగ్ డేటా పేర్కొంది.
బీఎ 2.86 రకానికి చెందిన ఈ జెఎన్.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ ముప్పు తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. ఇటీవల జెఎన్.1 కేసులు అనేక దేశాల్లో వ్యాపిస్తున్నాయి. కొవిడ్ కేసులతో పాటు ఈ ఉపరకం కేసులను కూడా నిదానంగా నిరంతర నిఘాతో కనుగొనాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.
దేశంలో 4565కి పెరిగిన క్రియాశీల కేసులు
దేశంలో గత 24 గంటల్లో 573 కరోనా కేసులు బయటపడగా, తాజా కేసులతో కలిపి క్రియాశీల కేసుల సంఖ్య 4565కి పెరిగింది. నిన్న ఒక్క రోజే ఇద్దరు మృతి చెందడంతో ఇప్పటివరకు దేశంలో కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,366 కి పెరిగింది. కొవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,76,550గా ఉంది.