అమెరికా వాండెర్‌బిల్ట్ వర్శిటీ పరిశోధకుల అధ్యయనం
వాషింగ్టన్ : కొవిడ్ వైరస్ పరీక్షల తీవ్రత దినం లోని వేళలు , మన శరీర జీవ గడియారం ఆధారంగా ఉంటుందని అమెరికా వాండెర్‌బిల్డ్ వర్శిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. మంగళవారం జర్నల్ ఆఫ్ బయోలాజికల్ రిథమ్స్ లో ఈ పరిశోధన వెల్లడైంది. కరోనా పాజిటివ్ పరీక్ష ఫలితాలు కచ్చితంగా రావాలంటే ప్రజలు రెండు సార్లు రెండు వేళల్లో పరీక్షలు చేయించుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు. మనశరీరం లోని సహజమైన, అంతర్గత ప్రక్రియ ప్రతి 24 గంటలకు నిర్రా, మేల్కొనడం వంటి దైనందిన జీవన చక్రాన్ని క్రమబద్దం చేస్తుంది. కొవిడ్ వైరస్ వ్యాపించినప్పుడు ఇన్‌ఫెక్షన్ సోకిన కణాలు వైరస్ నలుసులను రక్తంలోను, శ్లేష్మం లోనుమ విడుదల చేస్తాయి. మధ్యాహ్నం పూట సాధారణంగా ఈ చర్య చాలావేగంగా ముమ్మరంగా జరుగుతుంది.
రాత్రి 8 గంటల తరువాత వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో పరీక్ష చేస్తే తప్పుడు ఫలితాలే వస్తాయి. అందువల్ల వేళల బట్టి పరీక్ష చేస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట రోగులు ఇతరులతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు. వైద్య చికిత్సను కోరుకుంటారు. ఇవి వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందడానికి దోహదం చేస్తుంటాయి. సాధారణంగా ఆస్పత్రుల్లో ఈ పరిస్థితి ఉంటుంది. అందువల్ల పగటి పూట వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిర్ధారించడానికి మరింత పరిశోధనలు అవసరమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన కొవిడ్ పరీక్ష ఏసమయంలో చేస్తే కచ్చితంగా ఫలితాలు వస్తాయో తెలుసుకోడానికి, పరీక్ష కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.