Wednesday, November 6, 2024

యుకెలో థర్డ్ వేవ్..!

- Advertisement -
- Advertisement -

Covid Third wave arrives in UK

డెల్టా వేరియంట్ వల్లే..
ప్రభుత్వ సలహాదారు ఆడమ్ ఫిన్న్
వ్యాక్సినేషన్ ద్వారా కట్టడి చేయొచ్చని సూచన

లండన్: వేగంగా విస్తరించే గుణమున్న డెల్టా వేరియంట్ వల్ల యుకె(బ్రిటన్) థర్డ్‌వేవ్ బారిన పడిందని ఆ దేశ వైద్య నిపుణుడు, ప్రొఫెసర్ ఆడమ్ ఫిన్న్ తెలిపారు. యుకెలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆడమ్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, దాంతో డెల్టా వేరియంట్ విస్తరించకుండా అడ్డుకోవచ్చునని యుకె వ్యాక్సినేషన్, ఇమ్యూనైజేషన్ జాయింట్ కమిటీ(జెసివిఐ)కి ఆడమ్ సూచించారు.

డెల్టాతో వచ్చిన థర్డ్ వేవ్‌కూ, వ్యాక్సినేషన్‌కూ మధ్య ఇప్పుడు పరుగు పందెంలాంటిది జరుగుతున్నదని ఆడమ్ అన్నారు. ప్రత్యేకించి వృద్ధులకు సెకండ్ డోస్ ఇవ్వడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇప్పుడు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ తీరుతో డెల్టా వేరియంట్‌ను కట్టడి చేయగలరా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కచ్చితంగా చెప్పలేకపోయినా, ఆశాభావంతో ఉన్నానన్నారు. తాజాగా నమోదవుతున్న కేసుల డేటాను పరిశీలిస్తే పెరుగుదల కనిపిస్తోందని, అయితే తాను గత వారం భయపడిన స్థాయిలో లేదని ఆడమ్ అన్నారు. పరుగు కొనసాగుతోంది. ప్రత్యేకించి వృద్ధులకు త్వరగా రెండో డోస్ ఇవ్వగలిగితే ఆస్పత్రుల పాలయ్యేవారి సంఖ్యతోపాటు మరణాల సంఖ్యను తగ్గించవచ్చునన్నారు. దాంతో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యుకెలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో డెల్టా వేరియంట్‌వే అధికంగా ఉన్నట్టు గుర్తించారు.

ఇంగ్లాండ్ ప్రజా ఆరోగ్య సంస్థ(పిహెచ్‌ఇ) డేటా ప్రకారం ఒక్క డోస్ వ్యాక్సినేషన్ ద్వారా ఆస్పత్రులపాలయ్యే అవకాశాల్ని 75 శాతంమేర, రెండు డోస్‌ల ద్వారా 90 శాతంమేర తగ్గించవచ్చునని తేలింది. డెల్టా వేరియంట్ విషయంలోనూ వ్యాక్సిన్లు ఫలితాలిస్తున్నట్టు గుర్తించారు. తాజగా యుకెలో నమోదైన ఇన్‌ఫెక్షన్ రేట్ 1.21.4 మధ్యలో ఉన్నది. ఈ లెక్కనుబట్టి ఇన్‌ఫెక్షన్‌కు గురైన 10 మంది సగటున మరో 12 నుంచి 14మందికి అంటించగలరు. దీనినే ఆర్ నెంబర్ అంటారు. శుక్రవారం యుకెలో 10,476 కేసులు నమోదయ్యాయి.

కొన్ని వారాలుగా కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు. భారత్‌లో మొదట గుర్తించిన డెల్టా వేరియంట్ అక్కడ ప్రభావం చూపడానికి ముందు కేసుల సంఖ్య తగ్గిన విషయం గమనార్హం. సోమవారం నుంచి తమ దేశంలో లాక్‌డౌన్‌ను తొలగించాలని భావించిన యుకె ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నాలుగు వారాలకు అంటే జులై 19కి దానిని వాయిదా వేశారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి రేట్‌ను గుర్తించేందుకు దక్షిణ లండన్‌తోపాటు యుకెలోని కొన్ని ప్రాంతాల్లో పరీక్షల్ని పెద్ద సంఖ్యలో చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News