జర జాగ్రత్త , నిబంధనలు పాటించండి..!!
నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో కొవిడ్19 నిబంధనలు పాటించకపోతే థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరించారు. కొత్త వేరియంట్ పుట్టుకువస్తే అది సూపర్‌స్ప్రెడర్‌గా మారి వేగంగా వ్యాప్తి చెందుతుందని వారు తెలిపారు. పండుగల సమయంలో గుంపులుగా చేరకుండా ఉండాలని వారు సూచించారు. ఇమ్యూనైజేషన్‌ను పెద్ద ఎత్తున చేపట్టడం, కొత్త వేరియంట్ పుట్టకపోవడం వల్ల ఇటీవలి నెలల్లో థర్డ్‌వేవ్ రాకుండా అడ్డుకోగలిగామని ఇమ్యూనైషన్‌పై జాతీయ సాంకేతిక బృందం(ఎన్‌టిఎజిఐ) చైర్మన్ డా॥ ఎన్‌కె అరోరా తెలిపారు. సామాజిక, మత సమావేశాల వల్ల డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. పండుగల సమయంలో నిబంధనలు పాటించాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. సమావేశాలకు అడ్డుకట్ట వేసేలా కఠిన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాలకు సూచించారు.
ప్రస్తుతం కొవిడ్19 కేసులు తగ్గుముఖం పట్టాయి. మన పరిస్థితి మెరుగుపడింది. పండుగల సీజన్‌లో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించే అవకాశమున్నదని, అది సూపర్ స్ప్రెడింగ్‌కు కారణమై థర్డ్‌వేవ్‌కు దారితీస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్‌గులేరియా హెచ్చరించారు. వచ్చే రెండు, మూడు నెలలు వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఇప్పుడున్న మంచి పరిస్థితిని కొనసాగించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోజువారీ కేసులు దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో తగ్గాయి. అయితే, సమూహాలుగా చేరడం వల్ల ప్రపంచంలోని పలు చోట్ల కేసులు పెరిగిన ఉదంతాలున్నాయని అంటువ్యాధుల నిపుణుడు చంద్రకాంత్ లహరియా తెలిపారు.
2022 నూతన సంవత్సరం వరకల్లా దేశంలోని మెజార్టీ వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. అయితే, వ్యాక్సిన్ల ఇమ్యూనిటీ ఎంతకాలం పని చేస్తుంది..? కొత్త వేరియంట్ వస్తే పరిస్థితి ఎలా ఉండనున్నది..? లాంటి అంశాలపై ఇంకా శాస్త్రీయ అవగాహనకు రావాల్సి ఉన్నదని ఆయన అన్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు శాస్త్రీయంగా వ్యూహాత్మక విధానాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఓవేళ కొత్త వేరియంట్ సెప్టెంబర్‌లో వస్తే థర్డ్‌వేవ్ అక్టోబర్, నవంబర్‌లో తారాస్థాయికి చేరుతుందని, అయితే సెకండ్‌వేవ్‌లో వలె కేసుల సంఖ్య నాలుగు లక్షలకుపైగా ఉండే అవకాశం లేదని, లక్ష వరకూ ఉండవచ్చునని ఐఐటికాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్రఅగర్వాల్ తమ గణిత నమూనా ఆధారంగా అంచనా వేశారు. ఐఐటి బృందంలో మరో ఇద్దరు నిపుణులు కూడా ఉన్నారు.