రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సమీక్ష
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లోని కార్యాలయాల్లో పని చేసే దాదాపు 400 మంది సిబ్బంది కొవిడ్19 బారిన పడినట్టు అధికారికవర్గాలు తెలిపాయి. కొవిడ్ బారిన పడినవారిలో రాజ్యసభ సచివాలయంలో పని చేసే 65మంది, లోక్‌సభ సచివాలయంలో పని చేసే 200మంది, అనుబంధ కార్యాలయాల్లో పని చేసే 133మంది ఉన్నారు. వీరందరికీ జనవరి 4 నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జనవరి చివరి వారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, వందలమంది సిబ్బంది కొవిడ్‌బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
రాజ్యసభ సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సమీక్ష నిర్వహించారు. కార్యనిర్వాహక అధికారికన్నా కిందిస్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోంకు వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. డిఒపిటి ఇచ్చిన ఆదేశాలనే రాజ్యసభ సిబ్బందికి వర్తించేలా ఆదేశించారు. ఈ నెల చివరి వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపారు. పని వేళల్లోనూ మార్పులు చేశారు. ఉదయం రెండు విడతల్లో 10 గంటలకు సగం సిబ్బంది, 10 30కి మిగతా సిబ్బంది వచ్చేలా, వెళ్లేటపుడు కూడా అంతే వ్యవధి ఉండేలా ఆదేశించారు. లోక్‌సభ సిబ్బందికి కూడా ఇటీవలే ఇదే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి.