అభివృద్ధి దేశాలకన్నా మనమే ముందున్నాం : కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: కొవిడ్19 కట్టడికి దేశంలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన కార్యక్రమమని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. కొన్ని మీడియాల్లో వ్యాక్సినేషన్ లక్షాలను చేరుకోలేకపోయామంటూ తప్పుదోవ పట్టించే కథనాలొచ్చాయని ఆరోగ్యశాఖ విమర్శించింది. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాలో తప్పుదోవ పట్టించే విశ్లేషణ చేశారని, అది అసంపూర్ణ కథనమని తెలిపింది. గతేడాది జనవరి 16న చేపట్టిన వ్యాక్సినేషన్ ద్వారా అర్హులైన పౌరులకు ఇప్పటివరకు 90 శాతంకుపైగా మొదటి డోస్, 65శాతం వరకు రెండు డోసుల పంపిణీ పూర్తయిందని ఆరోగ్యశాఖ తెలిపింది. తక్కువ జనాభా కలిగిన పలు అభివృద్ధి దేశాలకన్నా మన దేశంలో వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయగలిగామని తెలిపింది. 100 కోట్ల డోసుల మైలురాయిని 9 నెలల్లోపే పూర్తి చేశామని, పలుమార్లు ఒకేరోజు కోటి డోసుల పంపిణీ జరిగిందని, ఓరోజు రికార్డుస్థాయిలో 2.51 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని గుర్తు చేసింది.
మొదటి డోస్‌ను అమెరికా తమ జనాభాలోని 73.2శాతానికి, యుకె 75.9 శాతం, ఫ్రాన్స్ 78.3 శాతం, స్పెయిన్ 84.7 శాతానికి పూర్తి చేశాయని ఆరోగ్యశాఖ తెలిపింది. రెండో డోస్‌ను అమెరికా 61.5శాతానికి, యుకె 69.5 శాతం, ఫ్రాన్స్ 73.2 శాతం, స్పెయిన్ 81 శాతం పూర్తి చేశాయని తెలిపింది. మన దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు (యుటిలు)మొదటి డోస్‌ను 100 శాతం పూర్తి చేశాయి. మూడు రాష్ట్రాలు, యుటిలు రెండో డోస్‌ను 100 శాతం పూర్తి చేశాయి. చాలా రాష్ట్రాలు 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా ముందుకు సాగుతున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివకే 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, ఈ నెల 3 నుంచి 1518 ఏళ్ల టీనేజర్లకు ప్రారంభించనున్నది.