Friday, November 15, 2024

రేపటి నుంచి వ్యాక్సిన్ సెంటర్లు పెంపు

- Advertisement -
- Advertisement -

covid vaccine centers increase from tomorrow in telangana

టీకాపై జనాల్లో పెరిగిన ఆసక్తి
మరో 37,785 మందికి డోసులు
వ్యాక్సిన్ తర్వాత వైరస్ సోకినా ప్రమాదం ఉండదు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి టీకా పంపిణీ కేంద్రాలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 722ను దాదాపు 2వేలకు పెంచేందుకు ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. డోసులు వేసుకునేందుకు జనాలు మరింత ముందుకు వస్తుండటంతో ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా శనివారం రాష్ట్రంలో మరో 37,785 మందికి వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 37,072 మంది మొదటి డోసు, 713 మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు 2,23,142 హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా, 1,69,642 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 1,13,791 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 64,861 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. అంతేగాక 3,89,383 వృద్ధులు, 2,02,380 మంది 45 నుంచి 59 ఏళ్ల మధ్యగల దీర్ఘకాలిక వయస్కులు టీకా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11,63,199 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. వీరిలో 8,46,718 మంది గవర్నమెంట్ కేంద్రాల్లో, మరో 3,16,481 మంది ప్రైవేట్ కేంద్రాల్లో టీకా తీసుకున్నట్లు అధికారులు నివేదించారు.

కేసులు పెరగడంతో ప్రజల్లో టెన్షన్….

కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో టెన్షన్ ప్రారంభమైంది. రోజురోజుకీ తీవ్రత అధికమవుతుండటంతో జనాలు టీకా వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కేటగిరిల్లోని కొత్త లబ్ధిదారులే కాకుండా, గతంలో టీకాను తిరస్కరించిన వాళ్లూ మళ్లీ లైన్లు కడుతున్నారు. ఈ జాబితాలో హెల్త్‌కేర్ వర్కర్లు ఉండటం కూడా గమనార్హం. మరోవైపు ఏప్రిల్ 1వ తేది నుంచి 45 ఏళ్ల పై బడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్న నేపథ్యంలో రద్దీ పెరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. అంతేగాక వైరస్ బారిన పడటం కంటే వ్యాక్సిన్ వేసుకోవడం మేలని సుమారు 70 శాతం మంది ప్రజలకు అవగాహన కల్గింది. దీంతో గత వారం రోజుల నుంచి వ్యాక్సినేషన్ సెంటర్లలో పబ్లిక్ పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు .ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లు కలిపి ప్రతి రోజు సగటున 50వేలకు తగ్గకుండా టీకా వేయాలని అధికారులు లక్షం పెట్టుకున్నారు. ఈక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా తీసుకునేలా ప్రత్యేక టీంలతో అవగాహన కల్పించనున్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతోనే వైరస్ తీవ్రతను కంట్రోల్ చేయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇటీవల హెచ్చరించింది. దీంతో వీలైనంత ఎక్కువ మందికి టీకా ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.

టీకా తీసుకుంటే హాస్పిటలైజేషన్ తప్పుతోంది…

టీకా తీసుకున్న తర్వాత పాజిటివ్ తేలిన వైరస్ తీవ్రత మైల్డ్‌గా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో సదరు బాధితుడు హాస్పిటలైజేషన్, సీరియస్ పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు వివరిస్తున్నారు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా అతి స్వల్ప సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే దానికి ప్రస్తుతానికి స్పష్టమైన కారణాలు గుర్తించనప్పటికీ, అవసరమైన మేరకు యాంటీబాడీస్ వృద్ధి చెందకనే పాజిటివ్ తేలి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఈక్రమంలో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైరస్‌ను పూర్తిస్థాయిలో నియంత్రించడం టీకాతోనే సాధ్యమని ఆరోగ్యశాఖ చెబుతుంది.

రాష్ట్రంలో టీకా పంపిణీ వివరాలు ఇలా….(27.03.2021)

కేటగిరీ          డోసు1              డోసు2

హెల్త్‌కేర్       2,23,142          1,69,642
ఫ్రంట్‌లైన్      1,13,791           64,861
60ఏళ్లు      3,89,383               ….
కోమార్పిడ్    2,02380               …..
మొత్తం      9,28,696            2,34,503

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News