న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారి విదేశీ ప్రయాణాల విషయంలో నెలకొన్న వివాదానికి ఏడు యూరోపియన్ దేశాలు తెరదించాయి. ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్, ఐస్‌లాండ్, ఐర్లాండ్, స్పెయిన్ ఈ ఏడు దేశాలు కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అటు స్విట్జర్లాండ్ కూడా కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిని అనుమతించాలని నిర్ణయించింది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇప్పటివరకు ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, వ్యాక్స్‌జెవ్రియా, జాన్సన్ అండ్ జాన్సన్, వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అంటే ఈ నాలుగు వ్యాక్సిన్లు వేసుకున్నవారికి మాత్రమే ఈయూ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలోకొవిషీల్డ్ లేకపోవడంతో చాలా మంది ప్రయాణికులను ఈయూ దేశాలు అనుమతించలేదు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు వేసుకున్న వాళ్లు ఈ దేశాలకు వస్తే క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కౌంటర్‌గా బుధవారం భారత విదేశాంగ శాఖ కూడా అదే నిర్ణయం తీసుకుంది.
ఈయూ దేశాలు తమ వ్యాక్సిన్లను వేసుకున్న వాళ్లను అనుమతించే వరకు అక్కడ నుంచి భారత్‌కు వచ్చిన వాళ్లూ క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో యూరోపియన్ యూనియన్‌లో ప్రస్తుతానికి ఈ ఏడు దేశాలు దిగివచ్చాయి. మిగతా దేశాల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఐరోపా సమాఖ్య గ్రీన్ పాస్ (టీకా పాస్‌పోర్ట్) విధానాన్ని భారత్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భారత్ వంటి దేశాల్లో దేశ జనాభాతో పోలిస్తే టీకాలు తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ తీసుకున్న వారినే అనుమతిస్తామన్న విధానం వివక్షాపూరితం అని భారత్ వాదిస్తోంది. ఇటీవల జి 7 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో కూడా కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈ సమస్యను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో భారత్ ఒత్తిడి ఫలించడంతో ఈయూ దేశాలు దిగివచ్చి కొవిషీల్డ్ ను గుర్తించాయి.