రెగ్యులర్ మార్కెట్ ఆమోదం పొందాక డోసు ధర రూ.275
న్యూఢిల్లీ : కరోనా టీకాలైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఒక్కో డోసు ధర రూ. 275 వరకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే సర్వీస్ ఛార్జీ రూ. 150 అదనంగా ఉంటుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ డోసు ధర రూ. 1200 కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ డోసు థర ప్రైవేట్ సంస్థలకు రూ. 780 గా ఉంది. సర్వీస్ ఛార్జీ రూ. 150 కూడా ఈ ధర లోనే కలిపి ఉంది. డ్రగ్‌రెగ్యులేటర్ నుండి సాధారణ మార్కెట్ కు అనుమతించిన తరువాతనే ధరల విషయంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఈ ఆమోదం కోసం వ్యాక్సిన్ తయారీ సంస్థలు వేచి చూస్తున్నాయి. వ్యాక్సిన్ ధరలను పరిమితం చేసే పనిని ప్రారంభించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) ఇప్పటికే ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే కొన్ని షరతులకు లోబడి వయోజన జనాభాలో ఉపయోగించడానికి ఈ వ్యాక్సిన్లకు రెగ్యులర్ మార్కెట్ ఆమోదం ఇవ్వాలని ఈ సంస్థలు దరఖాస్తు చేశాయి. దీనిపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కొవిడ్ 19 సబ్జెక్ట్ కమిటీ కూడా ఈనెల 19 న దీనికి సిఫార్సు చేసింది.