అంతర్జాతీయ రాకపోకల పునరుద్ధరణకూ చర్యలు
కాన్‌బెర్రా: భారత్‌లో అభివృద్ధి చేసిన ‘ కొవిషీల్డ్’ టీకాను గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా చేరింది. కొవిషీల్డ్‌తో పాటుగా చైనాకు చెందిన ‘ సినోవాక్’ను కూడా గుర్తించింది. దేశానికి చెందిన ఔషధ నియంత్రణ మండలి ‘ థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్’ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం తెలిపారు. ఈ నిర్ణయంతో ఆ టీకాలు తీసుకున్న వాళ్లు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. దీంతో పాటు నవంబర్‌నుంచి స్థానికులు, శాశ్వత నివాసితులకు అంతర్జాతీయ రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు మోరిసన్ ప్రకటించారు. అయితే వ్యాక్సినేషన్ పూర్తయిన వారు తిరిగొచ్చాక వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఇంకా టీకా తీసుకోని వారికి హోటల్‌లో 14 రోజుల క్వారంటైన్ తప్పదు.
కరోనాకు ముందునాటి జీవితాలను పునరుద్ధరించే విషయంలో ఆస్ట్రేలియన్లకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు మోరిసన్ ప్రకటించారు. విదేశాలకు వెళ్లాలనుకునే ఆస్ట్రేలియన్లకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రాలను ఇస్తామని, ఇది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకూ తగినట్లుగా ఉంటుందని ప్రధాని ప్రకటించారు. కరోనా కట్టడికి ఆస్ట్రేలియా మొదటినుంచి కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వీటిని నిరసిస్తూ ప్రజలు ఆందోళనలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ 80 శాతానికి చేరుకున్న నేపథ్యంలో క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. దేశ ఆదాయ వనరుల్లో ‘ అంతర్జాతీయ విద్య’ కీలకమైనది కావడంతో విదేశీ విద్యార్థులను తిరిగి రప్పించే పనిలో పడింది.