రూ 600 స్థానిక పన్నులు అదనం
సీరం సంస్థ సిఇఒ పూనావాలా
మూడో షాట్ ఇప్పుడు అత్యవసరం
న్యూఢిల్లీ : దేశంలో కొవిషీల్డ్ బూస్టర్ డోస్ రూ 600 (పన్నులు అదనం)గా ఉంటుంది. ఈ విషయాన్ని కొవిషీల్డ్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి అధర్ పూనావాలా శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దేశంలో 18 ఏండ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్‌లు కల్పించాలని నిర్ణయించడాన్ని పూనావాలా స్వాగతించారు. ఇది వైరస్ పూర్తి స్థాయి కట్టడికి కీలకమైన నిర్ణయం అవుతుందని తెలిపారు. తమ కంపెనీ ద్వారా భారీ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు, పంపిణీదార్లకు డిస్కౌంట్లు ఇస్తుందని వివరించారు. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ప్రైవేటు కేంద్రాలలో బూస్టర్ డోస్‌లు పడుతాయి. సకాలంలో తీసుకున్న కీలక నిర్ణయం అని సీరం ఇనిస్టూట్ అధినేత హర్షం వ్యక్తం చేశారు.
వివిధ ప్రాంతాలలో ఉన్న పన్నులు ఇతరత్రా కలిపి బూస్టర్ డోస్‌ను రూ 600 పైగా ధరకు అందించాలని తమ సంస్థ నిర్ణయించిందని వివరించారు. దేశంలో బూస్టర్ డోస్‌గా కొవోవాక్స్ ఆమోదం దక్కించుకుంటే అది రూ 900 (పన్నులు అదనం)గా పల్కుతుంది. ఇప్పటికైతే కొవిషీల్డ్‌కు బూస్టర్ డోస్ అనుమతిని ఇచ్చారు. త్వరలోనే కోవోవాక్స్ కూడా ఈ అనుమతిని పొందుతుందని భావిస్తున్నామని అధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని ఔషధ నియంత్రణ సంస్థ గత నెలలోనే సీరం ఇనిస్టూట్ ఉత్పత్తి అయిన కోవోవాక్స్‌ను 12 నుంచి 17 ఏండ్ల ప్రాయం వారికి వేసేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే నిర్థిష్ట షరతుల మేరకు వీరికి ఈ టీకా కల్పిస్తారు. నోవావాక్స్ నుంచి వైద్య సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు ద్వారా కొవోవాక్స్ తయారు అవుతోంది. దీనికి యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ కూడా వాడకపు అనుమతిని ఇచ్చింది.