కొవిషీల్డ్ రెండు డోసుల వ్యవధి తగ్గింపు
ఇమ్యూనైజేషన్ బృందం కీలక నిర్ణయం
ప్రభుత్వానికి పంపిన సిఫార్సులు
న్యూఢిల్లీ : దేశంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని 8-16 వారాలకు తగ్గించారు. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టిఎజిఐ) కీలక నిర్ణయం వెలువరించింది. సీరం ఇనిస్టూట్ ఈ టీకాను రూపొందించింది. డోసుల విరామ తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి బృందం తెలిపింది. ఇప్పటివరకూ ఈ వ్యాక్సిన్ రెండు విడతల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలు అంటే 84 రోజులుగా ఉంది. దేశంలో వైరస్ తీవ్రత ఇతరత్రా అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఇమ్యూనైజేషన్ బృందం అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తుంది. ఇప్పుడు ఈ టీకా డోసుల వ్యవధి మార్పు నిర్ణయం తీసుకుంది.జాతీయ కొవిడ్ టీకా కార్యక్రమం పరిధిలోనే ఎప్పటికప్పుడు టీకాలపై నిర్ణయాలు తీసుకుంటారు. యాంటీబాడీల ఉత్పత్తి స్థాయిని బట్టి వ్యవధి మార్పులో కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవధి తగ్గింపు వల్ల దేశంలో అత్యధిక సంఖ్యలో రెండు డోస్‌ల కార్యక్రమం పూర్తవుతుంది. ఇతర దేశాలలో ఇఈవలి కాలంలో కరోనా వైరస్ సరికొత్త రూపాలలో విస్తరిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతి దక్కింది. అయితే ఇప్పటికీ దేశంలో ఆరు నుంచి ఏడు కోట్ల మంది వరకూ కొవిషీల్డ్‌ను ఇప్పుడు ఉన్న గడువు కారణంగా పొందలేదు. రెండు డోస్‌ల మధ్య వ్యవధి ఇంతకు ముందు ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉంది. దీనిని ఈ సలహా బృందం సిఫార్సుల మేరకు ప్రభుత్వం గత ఏడాది మే నెలలో 12 నుంచి 16 వారాలకు పొడిగించింది.