ఇది శుభవార్తన్న పూనావాలా
న్యూఢిల్లీ: కొవిషీల్డ్‌ను కరోనాకు సమర్థవంతమైన టీకాగా ఫ్రాన్స్ శనివారం గుర్తించింది. దీంతో ఇప్పటివరకు 16 యూరోపియన్ దేశాలు కొవిషీట్డ్‌ను గుర్తించినట్లయింది. మన దేశంలో వాడుకలో ఉన్న రెండు కొవిడ్ టీకాల్లో ఒకటి భారత్ బయోటెక్ తయారీ కొవాగ్జిన్, రెండోది సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవిషీల్డ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఉత్పత్తి అధికంగా ఉన్న కారణంగా దేశంలో ఎక్కువ మందికి కొవిషీల్డ్ టీకాలే ఇచ్చారు. అయితే ఈ టీకాలు రెండు డోసులు తీసుకున్నప్పటికీ చాలా దేశాలు కొవిషీల్డ్‌ను కరోనాకు సమర్థవంతమైన టీకాగా గుర్తించకపోవడంతో ఈ టీకాలు తీసుకున్న వారు ఆ దేశాలకు వెళ్లినా క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొవిషీల్డ్‌ను గుర్తించాలని కేంద్రప్రభుత్వం ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకు వస్తోంది. అలాకాని పక్షంలో ఆ దేశాలనుంచి భారత్‌కు వచ్చే టూరిస్టులు అక్కడి టీకాలను తీసుకున్నా భారత్‌లో క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ వచ్చింది.
ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌కు చెందిన దేశాలు కొవిషీల్డ్‌ను గుర్తించాయి. ఇప్పటివరకు కొవిషీల్డ్‌ను గుర్తించిన 16 దేశాల్లో ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, ఫిన్లాండ్, జర్మనీ, గ్రీస్, ఐస్‌లాండ్, ఐర్లాండ్, లాట్వియా, నెదర్లాండ్స్, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఉన్నాయి. వీటిలో 13 దేశాలు ఇయు సభ్య దేశాలే. దీంతో ఇప్పుడు ఆ దేశాలు విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసినప్పుడు కొవిషీల్డ్ రెండు టీకాలు తీసుకున్న వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆ దేశాలకు వెళ్లడానికి వీలు కలుగుతుంది. కొన్ని దేశాలయితే ఆర్‌టిపిసిఆర్ నెగెటివ్ రిపోర్టు కూడా అడుగుతున్నాయి. ఇది నిజంగా మంచి వార్త అని కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సిఇఓ అదర్ పూనావాలా అన్నారు.