న్యూఢిల్లీ: కొవిషీల్డ్ ధరను తగ్గిస్తున్నట్లు ఉత్పత్తి సంస్థ అయిన సీరం ఇనిస్టూట్ బుధవారం కీలక ప్రకటన వెలువరించింది. కరోనా నివారణకు దేశంలో ఈ టీకాను విరివిగా వినియోగిస్తున్నారు. తమ టీకా కొవిషీల్డ్‌ను రాష్ట్రాలకు సరఫరా చేసే ధరలను 25 శాతం మేర తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఒక్కో డోస్‌ను రాష్ట్రాలకు ఈ సంస్థ రూ.400లకు విక్రయిస్తోంది. ఇకపై ఈ ధరను రూ.300 చేస్తున్నట్లు, తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు సీరం సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి అదర్ పూనావాలా ట్వీట్ వెలువరించారు. తగ్గింపు ధరలు తక్షణం అమలులోకి వస్తాయి. తమ నిర్ణయంతో రాష్ట్రాలకు వేల కోట్లలో నిధులు ఆదా అవుతాయని, ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రాలకు ఎక్కువ ధరను ఖరారు చేయడంపై సీరం సంస్థపై పలు విమర్శలు తలెత్తాయి. కేంద్రానికి సరఫరా డోసుకు రూ.150 ఖరారు చేసి, రాష్ట్రాలకు రూ.400 వేయడంపై వచ్చిన నిరసనలను సంస్థ పరిగణనలోకి తీసుకుంది. వేలాది మంది ప్రాణాలు కాపాడేందుకు, రాష్ట్రాలకు చెందిన వేల కోట్ల డబ్బులు ఆదా చేసేందుకు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్న పూనావాల దీనిని ధార్మిక ఔదార్యపు చర్యగా పేర్కొన్నారు.
Covishield price for states reduced to Rs.300