రూ.900 నుంచి రూ.225 కు తగ్గింపు
న్యూఢిల్లీ : కొవిడ్ టీకా కొవొవాక్స్ ధరను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మంగళవారం భారీగా తగ్గించింది. 12 -17 సంవత్సరాల పిల్లలకు టీకా వేయనుండగా, వాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్‌లో చేర్చిన మరుసటి రోజే సీరమ్ ఈ టీకా ధరను సవరించింది. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ డోస్ ధర రూ. 900 ఉండగా, ఇప్పుడు రూ.225 కు తగ్గించింది. దీనికి జిఎస్‌టి అదనంగా జోడించనుండగా, ఈ విషయాన్ని సీరం కంపెనీ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రిలో సర్వీస్ ఛార్జీగా రూ. 150 వరకు వసూలు చేయవచ్చు. టీకాకు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత ఏడాది డిసెంబర్ 28 న పెద్దల కోసం, 12 -17 సంవత్సరాల పిల్లల కోసం మార్చి 7 న అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది.
దేశం లోని 12 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలందరికీ కొవొవాక్స్ టీకా అందుబాటులో ఉంటుందని సీరం ఇన్‌స్టిట్యూట్ సిఇఒ అదర్ పూనావాలా మంగళవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. నొవావాక్స్ సంస్థ భారత్‌లో తయారు చేసిన టీకా ఇదేనని , ఐరోపా దేశాల్లో కూడా దీన్ని విక్రయిస్తున్నట్టు చెప్పారు. పిల్లల రక్షణకు మరో టీకా అన్న ప్రధాని మోడీ విజన్ ప్రకారం దీన్ని అందుబాటు లోకి తేవడమైందని తెలిపారు. ఎన్‌టియాగి (ఎన్‌టిఎజిఐ) సిఫార్సుపై ఈచర్యలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 12 నుంచి 14 ఏళ్ల లోపు వారికి బయోలాజికల్ ఇ టీకా కార్బెవాక్స్ , 15 నుంచి 18 ఏళ్లవారికి భారత్‌బయోటెక్ టీకా కొవాగ్జిన్ ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఇస్తున్నారు. ప్రైవేట్ సెంటర్లలో కొవాక్సిన్ డోసు ధర జిఎస్‌టితో కలిపి రూ.386 కాగా, కార్బెవాక్స్ ధర రూ.990 గా ఉంది.