Monday, January 20, 2025

విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి ఆవు బలి

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : మండల పరిధిలోని మాదారంలో ఇటీవల విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఆరు పశువులు మృతి చెందిన సంఘటన మరువకముందే, మండల పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన రైతు కుంజ సత్యంకు చెందిన ఆవు శుక్రవారం కరెంటు షాక్‌తో చనిపోయింది. ఉదయం మేతకు ఆవులను వదిలిపెట్టగా గాదెపాడు వెళ్లే రహదారి పక్కన వ్యవసాయ బావులు కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉండటం, చుట్టూ ఎటువంటి రక్షణ కవచం లేకపోవడంతో ఆవు ట్రాన్స్ఫార్మర్ వద్దకు మేత కోసం వెళ్లి షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయిందని రైతు సత్యం వాపోయాడు. దీని విలువ 40 వేల రూపాయలు ఉంటుందని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఆవు చనిపోయినందుకు వారి నుండి నష్టపరిహారం చెల్లించాలని కన్నీటి పర్వంతమయ్యాడు.

కాగా మండలంలో ఇటీవల తరచూ విద్యుత్ ప్రమాదాలు జరుగుతూ మూగజీవాలు బలవుతున్నా, విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. వర్షాలు, గాలి దుమారం వచ్చినప్పుడు విద్యుత్ తీగలు తెగిన ఈ శాఖ అధికారులు వెంటనే స్పందించి వాటికి మరమ్మతులు చేపడితే చాలావరకు ప్రమాదాలను నివారించవచ్చని మండల ప్రజలు అంటున్నారు. ప్రమాదాలు జరిగి మూగజీవాలు బలయ్యాక కంటి తుడుపు పరిహారం ప్రకటించి చేతులు దులుపుకునే కన్నా, అసలు ప్రమాదాలే జరగకుండా ట్రాన్స్ఫార్మర్లు ఎత్తులో పెట్టి, వాటి చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ప్రసార విషయంపై లోటు పాటు జరిగినప్పుడు వెంటనే స్పందించి, సరి చేస్తే ప్రమాదాలకు మూగజీవాలు బలికాకుండా ఉంటాయని మండల ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుగా ఏర్పాటు చేసి వాటి చుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News