Thursday, January 23, 2025

కొవిన్ లీకేజ్!

- Advertisement -
- Advertisement -

చాటు, రహస్యం, గోప్యత అనే వాటికి నిఘంటువులో తప్ప నిజ జీవితాల్లో బొత్తిగా చోటు లేని రోజుల్లో బతుకుతున్నామా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మన మీద మన నీడ చేతనే నిఘా వుంచుతున్నదా? ఇంతకంటే ఏ పరిజ్ఞానమూ లేని చీకటి రోజులే నయమనిపించే పరిస్థితి దాపురించనున్నదా? ఇది చాలా విపత్కర పరిస్థితి. హ్యాకింగ్ పరిజ్ఞానం ఎంత ఉపద్రవాన్ని కలిగిస్తుందో అనే భయం వణుకు పుట్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ కొవిన్ ద్వారా కోవిడ్ 19 (కరోనా) టీకా తీసుకున్న వారందరి ఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీలు, ఆధార్ సంఖ్యలు బహిరంగం అయ్యాయని పొక్కిన సమాచారం గుండెల్లో డైనమైట్లు పేలుస్తున్నది. గత మూడేళ్ళుగా కొవిన్ ద్వారా టీకాలు తీసుకొన్న సామాన్యులు, ప్రముఖులు అందరి వ్యక్తిగత సమాచారాన్ని టెలిగ్రామ్ బోట్ అనే ఇంటర్‌నెట్ మెసేజింగ్ పరికరం బహిర్గతం చేసిందని దానిలో ఆ డేటా అంతా కనిపించిందని ఈ వార్త తెలియజేసింది.

వెంటనే ఈ పరికరాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు చెబుతున్నారు. అయితే కొవిన్ డేటా లీక్ కాలేదని భద్రంగానే వున్నదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం ప్రకటనను నమ్మలేని పరిస్థితిని అదే తెచ్చుకొన్నది. ప్రధాని మోడీ ప్రభుత్వం తరచుగా అబద్ధాలను ఆశ్రయిస్తుందనే అభిప్రాయం స్థిరపడింది. అందుచేత టెలిగ్రామ్ బోట్‌లో కొవిన్ డేటా లీకైందన్న సమాచారాన్నే ప్రజలు నమ్మే అవకాశముంది. కొవిన్‌కు ఇచ్చిన టెలిఫోన్ నెంబర్‌ను టెలిగ్రామ్ బోట్‌లో ఎంటర్ చేస్తే అందుకు సంబంధించిన కొవిన్ సమాచారమంతా తెలుస్తున్నదని మలయాళ మనోరమ పత్రికలో వార్త వచ్చినట్టు సమాచారం. టెలిగ్రామ్ బోట్‌లో కొవిన్ ద్వారా కోవిడ్ టీకా తీసుకొన్న వారి సమాచారమంతా వున్నదని ఈ పత్రిక ప్రచురించింది. అందుచేత దీనిని మరో పెద్ద డేటా లీకేజ్ ఘటనగా పరిగణించవచ్చు. ప్రధాని మోడీ ప్రభుత్వం అతి పెద్ద డేటా లీకేజ్‌కి పాల్పడిందని తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి సాకేత్ గోఖలే ట్విట్టర్ పోస్టింగ్‌లో అభిప్రాయపడ్డారు.

అలాగే ఎన్‌సిపి నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్తీక్ చిదంబరం కూడా ఇదే సమాచారాన్ని వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్‌లో కొవిన్ ద్వారా కోవిడ్ టీకా తీసుకొన్నవారందరి సమాచారం బయటపడిందని వారు వెల్లడించారు. మొబైల్ నంబర్లు, ఆధార్ సంఖ్యలు, పాస్‌పోర్టు నంబర్లు, ఓటర్ కార్డు వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం కూడా బహిర్గతమైందని సాకేత్ గోఖలే పేర్కొన్నారు. మన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్, డిఎంకె ఎంపి కనిమొళి, బిజెపి ప్రముఖుడు కేంద్ర మాజీ ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్, కెసి వేణుగోపాల్, ఇంకా ఎంతో మంది ప్రముఖులు కోవిడ్ టీకాల సమయంలో ఇచ్చిన వ్యక్తిగత సమాచారం టెలిగ్రామ్‌లో దొరికిందని చెబుతున్నారు. 2013 ఆగస్టులో యాహు అకౌంట్లను హ్యాక్ చేసి రహస్య సమాచారాన్ని లీక్ చేశారు. అలాగే 2018 మొదటి నెలలో మన ఆధార్ సమాచారం హ్యాక్ అయింది. 110 కోట్ల భారతీయుల పేర్లు, అడ్రస్‌లు, ఫోటోలు, ఫోన్ నంబర్లు, ఇ మెయిల్స్ హ్యాకర్ల చేతికి చిక్కాయి. ఫింగర్ ప్రింట్లు, ఐరిస్ (కనుపాప) వివరాలు కూడా అప్పుడు లీకయ్యాయి.

2021 జూన్‌లో లింక్డిన్ సామాజిక మాధ్యమంలోని 70 కోట్ల మంది యూజర్ల సమాచారాన్ని దొంగిలించారు. ఎవరి ప్రైవేటు, వ్యక్తిగత సమాచారం బయటపడలేదని లింక్డిన్ వాదించింది. కాని యూజర్లకు తానిచ్చిన రహస్య సమాచార పరిరక్షణ హామీని అది పాటించలేకపోయిందనే మాట వాస్తవం. 2019 ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌లోని 53 కోట్ల మంది యూజర్ల వివరాలను బయటపెట్టగలిగారు. చైనాకు చెందిన అతి పెద్ద సామాజిక మాధ్యమం సినా రీబో నుంచి 2020 మార్చిలో 60 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీకయింది. తన దగ్గరున్న సమాచారాన్ని ఒక హ్యాకర్ పాక్షికంగా సేకరించగలిగాడని ఈ సంస్థ అంగీకరించింది. 10 లక్షల మంది తన అతిథుల సమాచారం హ్యాక్ అయిందని 2018 సెప్టెంబర్‌లో మారియట్ ఇంటర్‌నేషనల్ (స్టార్‌వుడ్) హోటల్ తెలియజేసింది. అనేక యాప్‌లు పని చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత వ్యూహాలను అమల్లోకి తేలేకపోతే ఎవరి వ్యక్తిగత సమాచారానికైనా లీకేజ్ ముప్పు తప్పదు.

కొవిన్ డేటా నుంచి నిజంగానే లీకేజ్ జరిగిందా లేదా అనేది స్పష్టంగా తేలవలసి వుంది. నమ్మకమైన దర్యాప్తు ద్వారా దానిని నిర్ధారించవలసిన బాధ్యత కేంద్ర పాలకులపై వుంది. అయితే అదానీ షేర్ల కుంభకోణం మీదనే విశ్వసించదగ్గ దర్యాప్తును జరిపించడానికి ససేమిరా అని భీష్మించుకొన్న ప్రధాని మోడీ ఇటువంటి సైబర్ నేరాలపై దృష్టి సారిస్తారని అనుకోలేము. సంపద వున్న దగ్గర దొంగలు కూడా వుంటారు. సమాచార చౌర్యం అనేది మామూలు అయిపోయిన రోజుల్లో ప్రభుత్వ వ్యవస్థలకైనా గట్టి భద్రత కల్పించడం అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News