న్యూఢిల్లీ : కొవిడ్ టీకాల నమోదు వేదిక కొవిన్ నుంచి అసంఖ్యాకంగా వ్యక్తుల సమాచారం లీకయిందనే వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తోసిపుచ్చింది. కొవిన్ పోర్టల్ డేటా పూర్తిగా భద్రంగా ఉందని ,డేటా లీకయిందనే వార్తలకు ఎటువంటి ప్రాతిపదికా లేదని వివరణ ఇచ్చారు. పలువురు రాజకీయ ప్రముఖులు , వివిధ రంగాలకు చెందిన వారి డేటా లీక్ అయినట్లు పలు పత్రికలలో వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుత వ్యవహారంపై పూర్తిస్థాయి పరిశీలన జరిపి తమకు నివేదిక అందించాలని సైబర్ భద్రతా సంస్థ సిఇఆర్‌టిని మంత్రిత్వశాఖ ఆదేశించింది. దేశంలో కోవిడ్ నుంచి రక్షణకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా పౌరుల ఆధార్‌కార్డు, ఇతరత్రా గుర్తింపు కార్డులను ,
ఫోన్‌నెంబర్లను ఈ పోర్టల్‌లో పొందుపర్చారు. డేటా గోప్యత తగు విధంగా భద్రంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారని , కొవిన్ పోర్టల్‌లో ఎటువంటి అవకతవకలకు వీలు లేకుండా అంతర్గత చర్యలకు ఆదేశించినట్లు ప్రకటనలో తెలిపారు. వ్యాక్సినేషన్లలో భాగంగా నమోదు అయిన పౌరుల వ్యక్తిగత సమాచార వివరాలు బయటకు వెళ్లాయని, ఇది పౌరుల గోప్యతకు భంగకరం అని తెలియచేస్తూ వార్తలు వెలువడటంతో కేంద్రం దీనిపై స్పందించింది. తమ పోర్టల్‌ను పూర్తిగా అనేక రకాల భద్రతలతో రూపొందించినట్లు, డేటా గోప్యతకు ఎటువంటి భంగం వాటిల్లే అవకాశం లేదని వివరణ ఇచ్చారు. కేవలం ఒటిపి అధీకృత స్పందనతోనే ఎవరికైనా డేటా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
టెలిగ్రామ్ సైట్‌లో సమాచారం
పలువురి వ్యక్తిగత సమాచారం సామాజిక మాధ్యమం టెలిగ్రామ్‌లో వెలుగులోకి వచ్చిందని డేటా సంబంధిత న్యూస్ పోర్టల్ సౌత్ ఆసియా ఇండెక్స్ పలు ట్వీట్లు వెలువరించింది. ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, పాస్‌పోర్టు నెంబర్లు, సెల్‌ఫోన్ల నెంబర్లు అనేకం వ్యాక్సిన్ల దశలో పొందుపర్చగా ఇవన్నీ కూడా ఇప్పుడు లీక్ అయినట్లు న్యూస్‌పోర్టల్ కొన్ని ఉదాహరణలతో తెలిపింది. వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఇది చాలా తీవ్రస్థాయి గోప్యతా ఉల్లంఘన అని తెలిపారు.
చిదంబరం సహా పలువురి గోప్యత విచ్ఛిత్తి
ప్రతిపక్ష నేతలకు చెందిన వారి డేటా ఎక్కువగా లీక్ అయిందని, ఫోన్‌నెంబర్లు నమోదు చేస్తే వ్యక్తుల పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడైంది. టిఎంసి నేత, రాజ్యసభ ఎంపి డెరెక్ ఒ బ్రెయిన్, కాంగ్రెస్ సీనియర్ నేతలు పి చిదంబరం, జైరాం రమేష్, కెసి వేణుగోపాల్, శివసేన నేత సంజయ్‌రౌత్. అభిషేక్ మనూ సింఘ్వీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభ ఎంపి సుష్మితా దేవ్ వంటి పలువురి డేటా ఇతరుల చేతుల్లో పడిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. తమకు ఇప్పటి విషయం గురించి ఆరోగ్యమంత్రిత్వశాఖ నుంచి సమాచారం తెలియగానే స్పందించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్, సాంకేతిక విషయాల మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీటు వెలువరించారు. సైబర్ భద్రతల సంస్థ వెంటనే దీనిపై ఆరా తీసేందుకు రంగంలోకి దిగిందని తెలిపారు.