హైదరాబాద్: మహేశ్ బ్యాంకు హ్యాకింగ్ లో సైబర్ నేరగాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. మహేశ్ బ్యాంక్ కేసు పురుగతిని ఆయన మీడియా సమావేశంలో వివరించారు. మహేశ్ బ్యాంక్ ఉద్యోగులకు సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ మెయిల్స్ పంపి, మెయిల్స్ ద్వారా బ్యాంకు సర్వర్ లో సైబర్ నేరగాళ్లు చొరబడ్డారని తెలిపారు. మహేశ్ బ్యాంకు సర్వర్ లో లోపాలున్నాయి. సర్వర్ లోపాలను అసరా చేసుకుని నగదు బదిలీ చేసుకున్నారని సివి ఆనంద్ పేర్కొన్నారు. సర్వర్ పకడ్బందీగా నిర్వహించడంలో మహేశ్ బ్యాంకు విఫలమైందన్నారు. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ కు 2 నెలల ముందే ఖాతాలు తెరిచి, జనవరి 23న సర్వర్ హ్యాక్ చేసి 4 ఖాతాల్లోకి నగదు నిల్వలను పెంచేశారని ఆయన చెప్పారు. సదురు ఖాతాల నుంచి పలు బ్యాంకులలోని 115 ఖాతాలకు బదిలీ చేశారు. 115 ఖాతాల నుంచి మరో 398 ఖాతాలకు నగదు బదిలీ చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపిలు ఉపయోగించినట్టు సిపి వెల్లడించారు. ఒక ఐపి స్విట్జర్లాండ్, మరొకటి కెనడాలో చూపిస్తోందన్నారు. ఈ హ్యాకింగ్ కేసులో మొత్తం 23 మందిని అరెస్టు చేశాం. అరెస్టయిన వారిలో నలుగురు నైజీరియన్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.