పోలీసులను సస్పెండ్ చేసిన నగర సిపి అంజనీకుమార్
రూ.15లక్షలు పట్టుకుని రూ.4లక్షలు చూపించారు
ఎస్సై, ఇద్దరు హెచ్‌సిలు, ఇద్దరు పిసిల సస్పెండ్
మనతెలంగాణ, హైదరాబాద్ : పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు రికవరీ డబ్బులను చూపించడంలో గోల్మాల్ చేసిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇందులో ఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుళ్లు మురళి, ఇమాన్యుయెల్, కానిస్టేబుళ్లు రవికిరణ్, జానీకిరమ్ గత ఏడాది నవంబర్ 7వ తేదీన పేకాట స్థావరంపై దాడి చేసి పేకాడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పేకాట కార్డ్‌తోపాటు రూ.15లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కానీ దాడి చేసిన పోలీసులు రూ.4లక్షలు మాత్రమే చూపించారు. మిగతా డబ్బులు తలా ఇంత పంచుకున్నారు. ఈ విషయంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు తెలియడంతో విచారణ చేయించారు. సిపి విచారణలో మిగతా డబ్బులు పంచుకున్నట్లు తేలడంతో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.