ఎటిఎం దొంగల అరెస్టు
కాల్పులు జరిపడంతో సెక్యూరిటీ గార్డు మృతి
రూ.6,31,000 నగదు, పిస్తోల్, మూడు రౌండ్లు, రెండు బైక్‌లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: సంచలనం సృష్టించిన కూకట్ పల్లి ఎటిఎం రాబరీ కేసులో ఇద్దరు దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6,31,000 నగదు, పిస్తోల్, మ్యాగజైన్, ఒక రౌండ్, రెండు బైక్‌లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి విసి సజ్జనార్ వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ర్టం, సమస్థీపూర్ జిల్లా, కుషాయా పోస్టు, టోలేమతురాపూర్‌కు చెందిన అజీత్ కుమార్ ప్యాకేజింగ్ కంపెనీలో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. గండి మైసమ్మ వద్ద ఉంటున్నాడు. ముఖేష్ కుమార్ విద్యార్థిగా ఉన్నాడు. అజీత్‌కుమార్ బతుకు దెరువు కోసం 2011లో నగరానికి వచ్చి దుండిగల్ సమీపంలోని ప్యాకేజింగ్ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. ఎల్‌బి నగర్, కీసర, దుండిగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ ప్యాకేజి కంపెనీల్లో పనిచేశాడు. 2018లో పని మానేశాడు. వ్యసనాలకు బానిసగా మారడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో దొంగతనాలు చేయాలని ప్లాన్ వేశాడు. దుండిగల్ ఏరియాలోని ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్ ఆఫీసుల కార్యకలాపాలు గమనించాడు. లోపలికి వెళ్లి క్యాషియర్‌ను బెదిరించి ఐరన్ రాడ్‌తో కొట్టాడు. క్యాషియర్ అరవడంతో అతడి వద్ద ఉన్న డబ్బులను తీసుకుని పారిపోయాడు. అజీత్‌ను దుండిగల్ పోలీసులు మే 28, 2018లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బీహార్‌కు వెళ్లిపోయాడు. ఫిబ్రవరి, 2020లో మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాడు. గండిమైసమ్మ వద్ద ఉంటూ స్థానికంగా ఉన్న ప్యాకేజింగ్ కంపెనీల్లో పనిచేశాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు చోరీలు చేయాలని ప్లాన్ వేశాడు. మార్చి, 2021లో కంట్రీమేడ్ పిస్తోల్ కొనుగోలు చేసేందుకు స్నేహితుడు ముఖేష్ కుమార్‌కు రూ.30,000 పంపించాడు. వాటితో ముఖేష్ పిస్తోల్, 5 లైవ్ రౌండ్లు కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. పిస్తోల్ పనిచేస్తుందా లేదా అని పరీక్షించేందుకు గండిమైసమ్మ సమీపంలోని డి పోచంపల్లి సమీపంలోని అడవిలోకి వెళ్లి పిస్తోల్‌తో ఫైరింగ్ చేసి చూశాడు. నిందితులపై దుండిగల్, జీడిమెట్ల, కీసర, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నిందితులను కూకట్‌పల్లి, ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు.
జీడిమెట్లతో ప్రారంభం….
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లోని లక్ష్మీ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ యజమానిని పిస్తోల్‌తో బెదిరించి యాపిల్ మొబైల్ ఫోన్, రూ.1,95,000దోచుకుని వెళ్లారు. ఇద్దరు కలిసి వాటిని పంచుకున్నారు. మార్చి 24, 2021లో పల్సర్ బైక్‌ను దొంగిలించాడు, తర్వాత మరో బైక్‌ను చోరీ చేసి వాటిపై తిరుగుతున్నారు. గత నెల 29వ తేదీన ఎర్రగడ్డ సర్కిల్‌కు పల్సర్ బైక్ ప వచ్చారు, ఎటిఎం క్యాష్ లోడింగ్ చేసే వాహనాన్ని చూశారు. వాహనాన్ని ఇద్దరు కలిసి బైక్‌పై అనుసరించారు. సిబ్బంది వరుసగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ల ఎటిఎంను లోడ్ చేస్తుండగా ఫాలో అయ్యారు. కూకట్‌పల్లిలోని పటేల్‌కుంట పార్క్ ఎటిఎం వద్దకు 1.50గంటలకు వచ్చి సిబ్బంది ఎటిఎంలో క్యాష్ లోడ్ చేసేందుకు వెళ్లారు. అజీత్ హెల్మెట్ పెట్టుకుని ఎటిఎం వద్దకు వెళ్లి పిస్తోల్ చూపించి డబ్బులు దోచుకునేందుకు బెదిరించాడు. దీంతో సెక్యూరిటీ గార్డు పిస్తోల్‌ను లాక్కునేందుకు ప్రయత్నించడంతో అజీత్‌కుమార్ కాల్పులు జరిపాడు. వెంటనే మిగతా వారు వచ్చి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా వారినుంచి విడిపించుకుని రూ.5లక్షలు తీసుకుని పారిపోయాడు. కాల్పుల్లో గాయపడిన అలీబేగ్ మృతిచెందగా, శ్రీనివాస్ గాయపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు బీహార్‌కుపారిపోగా స్పెషల్ టీం పట్టుకుని వచ్చారు.
CP Sajjanar press meet about Kukatpally ATM Case