ప్రారంభించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, సిటిబ్యూరోః మొబైల్ బస్సులు, డిజిటల్ మొబైల్ బస్సులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ప్రారంభించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేణీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులను సిపి స్టిఫెన్ రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. వేణీ రావు ఫౌండేషన్, ఎస్‌సిఎస్‌సి ఆధ్వర్యంలో చిరాక్ పబ్లిక్ స్కూల్‌లో వాడిన బస్సులను రినోవేషన్ చేశారు. వాటిని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలకు వైద్యం అందించాలని నారాయణపేట జిల్లాకు పంపించనున్నారు. వేణీ రావు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రత్నా రెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి, కొండాపూర్ ఆస్పత్రికి బస్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా సమయంలో పేదలకు మంచి వైద్యం అందించాలని సాయం చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌సిఎస్‌సి ప్రతినిధులు, పోలీసులు పాల్గొన్నారు.