హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం నాడు మంత్రి కెటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతిభవన్‌లో మంత్రి కెటిఆర్‌ను కలిసిన సిపి స్టీఫెన్ రవీంద్ర ఒక మొక్కను అందజేశారు. అదేవిధంగా ముద్రణ, స్టేషనరీ విభాగం డిజిగా నియమితులైన ఐపిఎస్ అధికారి ఉమేష్ షరాఫ్ హోం శాఖ మంత్రి మహమూద్ అలీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై కొద్దిసేపు పాటు భేటీ అయ్యారు.
1990 బ్యాచ్ అధికారి రాష్ట్రంలోని పశ్చిమ మండల ఐజీగా విధులు నిర్వహించిన స్టీఫెన్ రవీంద్ర గతంలో హైదరాబాద్‌లో డీసీపీగాను పనిచేశారు. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో సమర్థవంతంగా పని చేసిన అధికారిగా గుర్తింపు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత స్టీఫన్ రవీంద్రను తెలంగాణకు కేటాయించారు. గత ఏడాది రాష్ట్రంలో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర ఇంఛార్జ్‌గా ఉన్న విషయం విదితమే.