ఉమెన్ పోలీసులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, బాడీ వార్న్ కెమెరాలు
రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ప్రారంభించిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్
మనతెలంగాణ, హైదరాబాద్ : నగరంలో క్రైం రేటును జీరో చేయడమే తమ ధ్యేయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులకు కొత్త టెక్నాలజీకి సంబంధించిన పరికరాలను సిపి విసి సజ్జనార్ అందజేశారు. కేసుల దర్యాప్తులో కొత్త టెక్నాలజీ పోలీసులకు సహకరిస్తుందని అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసే పోలీసులు కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని కోరారు. వీటిని సరిగ్గా వాడితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. మహిళా పోలీసులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేశారు, దీనిని నాలుగు గంటలు ఛార్జింగ్ చేస్తే 90 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
ఉమెన్ పోలీసులు వీటిని పెట్రోలింగ్, క్రైం ప్రివెన్షెన్ తదితరాలకు వాడనున్నారు. కొత్తగా రూపొందించిన జాకెట్లను అందజేశారు. వీటిని చెమట, గాలితగిలే విధంగా తయారు చేశారని, ఇందులో ట్యాబ్లెట్, బాడీ వార్న్ కెమెరాను పెట్టుకోవచ్చు. ఆరు బాడీవార్న్ కెమెరాలు అందించారు, వాటికి జిపిఎస్ సదుపాయం ఉంది.రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టారు. ఈ కెమెరాలో 128 జిబి కలిగిన హార్డ్ డిస్క్ ఉంటుంది. నాలుగు థర్మల్ ప్రింటర్లను నలుగురు సెక్టార్ ఎస్సైలకు అందజేశారు. కార్యక్రమంలో డిసిపిలు అనసూయ, పద్మజా, వెంకటేశ్వర్లు, ఇన్స్‌స్పెక్టర్ రవీందర్, ఎస్సైలు పాల్గొన్నారు.