హనుమకొండ: దేశంలో త్యాగాల పునాదులపై ఏర్పడి ప్రజా పోరాటాలే ఊపిరిగా ముందుకు సాగుతున్న పార్టీ సిపిఐ అని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వేయిస్తంభాల దేవాలయం నుండి పబ్లిక్‌గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలో వందలాది మంది సిపిఐ కార్యకర్తలు ఎర్రచొక్కాలు, మహిళా కార్యకర్తలు ఎర్ర చీరలు ధరించి పాల్గొన్నారు. అనంతరం పబ్లిక్‌గార్డెన్ వద్ద జరిగిన సభలో చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ప్రజల కోసం అలుపెరుగని పోరాటాలు సిపిఐ నిర్వహిస్తున్నదన్నారు.
దున్నేవాడికే భూమి అన్న నినాదంతో తెలంగాణలో గ్రామగ్రామాన భూములు పంచిన ఘనత సిపిఐదేనని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో అణిచివేత కొనసాగుతున్నదని అందుకే ఎర్రజెండా ఆధ్వర్యంలో భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముందుకు సాగాలని కోరారు. ఈసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంఎల్‌ఎ పోతరాజు సారయ్య, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, ఆదరి శ్రీనివాస్, వేల్పుల ప్రసన్న, స్వరూప, దీనా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.