Thursday, November 21, 2024

ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాకర్ల సుబ్బారావు(96) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణంగా గత నెల రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు వైద్య సేవలు పొందుతూ శుక్రవారం ఉదయం మరణించినట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. వైద్య రంగంలో విశేష కృషి చేసిన కాకర్ల సుబ్బారావు 1925.. జనవరి 25న కృష్ణా జిల్లాలోని పెదముత్తేవి గ్రామంలో జన్మించాడు. ఈక్రమంలో కాకర్ల సుబ్బారావు చల్లపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం , బందరు హిందూ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో చేరి 1950లో డాక్టరు పట్టా పొందారు. 1951లో హౌస్ సర్జన్ పూర్తి చేసిన తరువాత వైద్య రంగంలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అనంతరం న్యూయార్క్, బాల్టిమోర్ నగరాలలో వైద్యుడిగా పనిచేసిన ఆయన 1956 తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రధాన రేడియాలజిస్టుగా పనిచేశారు. 1970లో తిరిగి అమెరికా వెళ్లిన ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ రేడియాలజిస్టు పట్టా పొంది కొద్దికాలంపాటు అమెరికాలో వైద్యునిగా పనిచేశారు. ఆ సమయంలో అక్కడి తెలుగు వారికోసం ఏర్పడిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మొదటి అధ్యక్షుడు పనిచేశారు. కాగా 1986లో తిరిగి హైదరాబాద్ వచ్చిన కాకర్ల నగరంలోని నిమ్స్‌లో వైద్యునిగా విధులు నిర్వర్తించారు. నిమ్స్ ఆస్పత్రిలోని అన్ని విభాగాలను వృద్ధి చేయడంతో పాటు కార్పొరేటు ఆస్పత్రులకు ధీటుగా నిమ్స్‌ను తీర్చిదిద్దారు. ఒకవైపు వైద్య సేవలందిస్తూనే మరోవైపు రేడియాలజీలో అనేక పుస్తకాలు, జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలు రాశారు. తాను రచించిన పుస్తకాలలోని అంశాలపై పలు దేశాలలో ఉపన్యాసాలిచ్చారు. వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరంలో కాకర్లను పద్మశ్రీ అవార్డు వరించింది. ఈక్రమంలో కాకర్ల సుబ్బారావు మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాకర్ల సేవలందించారని కొనియాడారు. నిమ్స్ డైరక్టర్‌గా కాకర్ల సుబ్బారావు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను స్మరించుకున్న సీఎం కాకర్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాకర్ల సుబ్బారావు మృతిపట్ల మంత్రి ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు. వైద్య రంగానికి కాకర్ల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

former mla subbaraju passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News