సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూటి ప్రశ్న
బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దని హితవు
చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించిన వారందరూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తోకలేనా అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆయన చెన్నై నుంచి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వారందరినీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారనడం సమంజసం కాదన్నారు. కమ్యూనిస్టులు విమర్శించినా చంద్రబాబే చేయిస్తున్నారని చెప్పడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. చివరకు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత విమర్శించినా కూడా చంద్రబాబు మద్దతుతోనే విమర్శిస్తుందని పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దని హితవు పలికారు. ఇది పరోక్షంగా చంద్రబాబు నాయుడును బలపరచడమేనని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రియే కాకుండా ఆయన మంత్రివర్గం, సలహాదారులు కూడా విచిత్రంగా మాట్లాడాటం సరికాదన్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఆయన సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.