అగ్నిపథ్ కుట్రదారు ప్రధాని మోడీనే
యువత ఆందోళనలో న్యాయముంది
తక్షణమే రద్దు చేయాలి : సిపిఐ నారాయణ డిమాండ్
హైదరాబాద్ : ప్రధాని మోడీ ఇండియన్ ఆర్మీలో అగ్నిపథ్ అనే పేరుతో పథకాన్ని తెచ్చి యువతను అగ్నిగుండంలోకి నెట్టాలని చూస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మండిపడ్డారు. లోపభూయిష్టమైన, ఉద్యోగ భద్రతలేని ఈ పథకం పట్ల కడుపుమండిన యువత కేంద్రం ఒంటెత్తు పోకడపై తిరగబడుతున్నారని పేర్కొన్నారు. యువత తిరుగుబాటును రాజకీయం చేస్తూ ప్రతిపక్షాల కుట్రల కారణంగానే ఆందోళనలు అంటూ కేంద్ర ప్రభుత్వం, బిజెపి నేతలు వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అగ్నిపథ్ ద్వారా ఎందరిని నియమించుకున్నా నాలుగేళ్ల తరువాత 75 శాతం మందికి వెనక్కు పంపేలా ఆ పథకం రూపకల్పన చేయడానికి ఆర్మీ ఉద్యోగార్థులు జీర్ణించుకోలేక దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారని పేర్కొన్నారు.
ఇప్పటికే ఆర్మీలో పని చేసే పదవీ విరమణ చేసిన వారి సమస్యలే పరిష్కారం కావడం లేదని, నాలుగేళ్లు పనిచేయించి ఇంటికి పంపే వారికి తాము న్యాయం చేస్తామన్న కేంద్ర మాటలు నమ్మశక్యం కావని యువత ఆందోళన బాట పట్టిందని స్పష్టం చేశారు. అయితే ఈ ఆందోళనలు కొన్ని చోట్ల ఉద్రిక్తంగానూ మారాయని తెలిపారు. యువకులు కడుపు మండి చేసిన ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి బిజెపి నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అగ్నిపథ్ పేరుతో జాతీయ స్థాయిలోనే ప్రధాని మోడీ కుట్ర చేశారని దుయ్యబట్టారు.
ఆందోళనల వెనక ఎవరో ఉన్నారని, రెచ్చగొడుతున్నారని, సికింద్రాబాద్ ఘటన వెనుక టిఆర్‌ఎస్ ప్రభుత్వ హస్తముందని సామాజిక మాధ్యమాల్లో మార్పింగ్ వీడియోలు, ఆడియోలతో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బిజెపి నేతలు అంటున్నట్టు తెలంగాణ ఆందోళనల వెనుక ప్రతిపక్షాలు ఉంటే, హర్యానాలో ఉన్నది బిజెపి ప్రభుత్వమే అయినా అక్కడ ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయని ఎదురు ప్రశ్నించారు. బీహార్‌లోని ప్రభుత్వంలో బిజెపి భాగస్వామ్యంగా ఉందని అక్కడ ఎందుకు ఆందోళనలు తీవ్రతరమయ్యాయని సూటిగా నిలదీశారు. యువత తమ జీవితాలను నిలుపుకోవడం కోసం చేస్తున్న ఆందోళనకు కారణమైన సమస్యలను పరిష్కరించకుండా అణచివేత చర్యలు చేపట్టడం వలన పోరాటాలు మరింత తీవ్రతరమవుతాయని స్పష్టం చేశారు. యువత ఉద్యమాలను కుట్ర అని బ్లాక్ మెయిల్ చేయడం మాని అన్యాయంగా రూపొందించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.