Thursday, January 23, 2025

ఎన్నికల కోసమే 2 వేల నోట్ల రద్దు: సిపిఐ నారాయణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ. 2000 నోట్ల ఛలామణిని నిలుపు దల చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ దేశంలో అవినీతి లేదని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మాత్రం హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిజంగానే మోదీ ప్రభుత్వానికి బ్లాక్ మనీని అంతం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రూ. 2 వేల నోట్లను వెంటనే రద్దు చేయాల్సి ఉండేదన్నారు. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు సమయంలోనే కోట్ల నల్లధనం వైట్ మనీగా మారిందని విమర్శించారు. అంతేకాకుండా గతంలో పెద్ద నోట్ల రద్దు ప్రక్రియలో 3.4 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయటపడుతుందని, తద్వారా ప్రతి భారతీయుడు అకౌంట్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని నాడు మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని సిపిఐ నేత నారాయణ గుర్తు చేశారు.

కానీ ఎవరి అకౌంట్లో పైసా కూడా జమ కాలేదని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిజంగా మోదీ ప్రభుత్వానికి బ్లాక్ మనీ అంతం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మార్చుకునే అవకాశం ఇవ్వకుండా ఉండేదన్నారు. కుస్తీ వీరులు ఢిల్లీ రోడ్ల మీద ఆందోళన చేస్తుంటే.. మోదీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. అంతర్జాతీయంగా క్రీడల్లో రాణించి పథకాలు సాధించిన మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదన్నారు. ఎంపీ బ్రిడ్జ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకమైన ప్రభుత్వాలను తొక్కేసేందుకు గవర్నర్ల వ్యవస్థతో ఎదురు వస్తుందన్నారు. తెలంగాణలో శాసనసభ ఆమోదించిన బిల్లులను పంపిస్తే గవర్నర్లు ఆలస్యం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్లు ఉత్సవ విగ్రహం లాంటి వారిని, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని చట్టంలో కూడా ఉందన్న విషయాన్ని సిపిఐ నారాయణ గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News