విపక్ష కూటమి “ఇండియా” కు సిపిఐ జాతీయ కార్యదర్శి అంజన్ సూచన
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఘోసి నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించడం విపక్షాల కూటమి “ఇండియా ” కిరీటంలో సువర్ణ తురాయి వంటిదని ప్రశంసిస్తూ కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడానికి ‘ఇండియా’కు ఇది సమయమని సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ సూచించారు. ఆదివారం పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ విపక్షాలు ఇప్పుడు కనీస ఉమ్మడి కార్యక్రమం వైపు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
“సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, వివిధ అంశాలకు సంబంధించి మార్గదర్శకాలు మనం రూపొందించాల్సి ఉందని, 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇది పవిత్ర గ్రంధంగా ఉంటుందని” చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగిసిన తరువాత ‘విపక్షాల రైలు’ దేశంలో ముందుకు సాగుతుందని, విపక్షాల నాయకులు ప్రజలకు భారీ ఎత్తున చేరువవుతారని చెప్పారు. ఇది అనుకూలమైన క్షణమని, మార్పు ఆసన్నమైందని ప్రజలు గ్రహించారని ఆయన పేర్కొన్నారు. మూడు డజన్ల బీజేపీ మంత్రులు, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్‌ఎల్‌ఎలు వీరంతా ఘోసి నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రచారం సాగించినప్పటికీ, ప్రజలు బీజేపీని ఈ ఉప ఎన్నికల్లో తిరస్కరించారని అంజన్ ఉదహరించారు.
ఎస్‌పి నాయకులు శివపాల్‌సింగ్ యాదవ్, రామ్‌గోపాల్ యాదవ్, ఘోసిలో ప్రచారం సాగించారని, సిపిఐ స్థానిక కార్యకర్తలు కూడా ఎస్‌పి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారని చెప్పారు. ఘోసి నుంచి ఎస్‌పి అభ్యర్థి సుధాకర్ సింగ్ విజయం సాధించడం సిపిఐకి సరైన ఉద్దీపనగా అంజన్ అభివర్ణించారు. అంజన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా బీజేపీ భారీ వాదనలు, హామీలు ఈసారి ఉప ఎన్నికల్లో పనిచేయలేదని, ఇతర పార్టీలు విజయం సాధించాయని పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు లిట్మస్ పరీక్ష వంటివని పేర్కొన్నారు. ఘోసి లో విజయం వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుతో పార్టీలన్నీ కలిసి “ఇండియా” పతాక శీర్షిక కింద పనిచేయాలన్న గుణపాఠం నేర్పుతుందన్నారు.